మాదకద్రవ్యాలను ఎన్ని విధాలుగా రవాణా చేయవచ్చునో చాలా సినిమాలలో చూపించారు. వాటన్నిటినీ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు కూడా చాలా క్లోజ్ గా ఫాలో అయిపోతున్నట్లున్నారు. అందుకే దక్షిణాఫ్రికా నుండి దుబాయి మీదుగా హైదరాబాద్ చేరుకొన్న మోసియా మూస అనే 32 ఏళ్ల యువతి కడుపులో దాచుకొన్న మాదక ద్రవ్యాలను వారు కనిపెట్టేసినట్లున్నారు. ఆమె తను గర్భవతినని నమ్మించేప్రయత్నం చేసింది. కానీ స్కానింగులో ఆమె కడుపులో మాదకద్రవ్యాల ప్యాకెట్లు ఉన్నట్లు కనుగొన్న అధికారులు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సహజ పద్దతుల ద్వారా ఆమె కడుపులో నుండి ఆదివారం రాత్రి వరకు 16ప్యాకెట్లు బయటకు తీశారు. మళ్ళీ ఈరోజు మరో 24 ప్యాకెట్లను బయటకు తీశారు. ఇంకా ఆమె కడుపులో ఏమయినా ప్యాకెట్లు మిగిలి ఉన్నాయో లేదో తెలుసుకొనేందుకుస్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇంతవరకు బయటకు తీసిన ప్యాకెట్ల బరువు 420 గ్రాములు వాటి ధర సుమారు కోరి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమె కడుపులో ప్యాకెట్లను బయటకు తీయడానికి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని తెలిపారు. మందులు ఇచ్చి సహజ పద్దతుల ద్వారా బయటకు తీసామని తెలిపారు. ఒకవేళ ఆ ప్యాకెట్లు కడుపులో పగిలినట్లయితే ఆమె ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేదని వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. ఆమె ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది.
ఆమె పాస్ పోర్ట్ మరియు టికెట్ల ఆధారంగా ఆమె జోహాన్స్ బర్గ్ నుండి ఆగస్ట్ 23వ తేదీన దుబాయ్ వచ్చి అక్కడి నుండి మళ్ళీ బ్రజిల్ దేశంలో సో పోలో నగరానికి వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు. మళ్ళీ అక్కడి నుండి ఆగస్ట్ 28న దుబాయ్ చేరుకొంది. ఆ మరునాడు దుబాయ్ నుండి ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ చేరుకొంది. ఆమె ఆ మాదకద్రవ్యాలను బ్రెజిల్ దేశంలోనే కడుపులో అమర్చుకొని దుబాయ్ తిరిగి వచ్చినట్లు మాదకద్రవ్య నిరోధక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
ఆమె హైదరాబాద్ లో 10 రోజులు ఉండి మళ్ళీ దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాలోని జోహాన్స్ బర్గ్ తిరిగి వెళ్లేందుకు విమాన టికెట్లు ముందే కొని ఉంచుకొంది. ఈ పది రోజుల్లో హైదరాబాద్ లో ఆమె తన ప్రాణాలకు తెగించి కడుపులో దాచుకొని తెచ్చిన మాదకద్రవ్యాలను ఎవరికి ఇవ్వడానికి వచ్చింది? ఆమెకు మాదకద్రవ్యాలను ఎవరు ఇచ్చారు? వంటి వివరాలన్నిటినీ పోలీసులు ఆమెను ప్రశ్నించి తెలుసుకొనేందుకు ఎదురు చూస్తున్నారు. వైద్యులు అనుమతించిన తరువాత అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తారు.