హైదరాబాద్: విజయవాడలో నిన్న ఉదయం కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయిన ఘటన నేపథ్యంలో ప్రముఖ మద్యం బ్రాండ్లయిన బ్యాగ్ పైపర్, ఓల్డ్ ట్యావర్న్, ఆఫీసర్స్ ఛాయిస్ బ్రాండ్లలోని నిర్ణీత బ్యాచ్‌లపై ఆంధ్రప్రదేశ్‌లో తాత్కాలిక నిషేధం విధించారు. ఈ బ్యాచ్‌ల శాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపారు. మరోవైపు, ఈ బార్లో నిన్న ఈ బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేయలేదని, ఈ బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యాన్ని సరఫరా చేశారని ఒక వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే స్వర్ణ బార్ భాగస్వాములపై 304 ఏ,328 సెక్షన్ల కింద కేసు పెట్టారు. వీరిలో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు తల్లి బాల త్రిపురసుందరమ్మ కూడా ఉన్నారు. ఈ బార్‌ను నిబంధనలకు విరుద్ధంగా హోటల్ ‘ఎమ్’ యొక్క సెల్లార్లో నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. కృష్ణలంక ప్రాంతం ఎక్సైజ్ సీఐను సస్పెండ్ చేశారు. ఈ సాయంత్రానికి మద్యం శాంపిల్స్‌పై ఎఫ్ఎస్ఎల్ నివేదిక రానుంది. మరోవైపు మల్లాది విష్ణును ఈ కేసులో 9వ నిందితుడిగా చేర్చారు.