వైసీపీ క్యాడర్లో అసంతృప్తి లావాలా బయటకు రావడం ప్రారంభమయింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పార్టీ కోసం కష్టపడిన .. ఇతర వర్గాల వారిని దూరం పెట్టారనే అసంతృప్తి మెజార్టీ క్యాడర్లో ఏర్పడింది. పెద్దగా కష్టపడకపోయినా… కొంత మంది అదే పనిగా పెద్ద పెద్ద పదవులు పొంది.. రూ. లక్షలు జీతాలు వచ్చే నామినేటెడ్ పోస్టులు.. పైరవీలు చేసుకునే అవకాశాలు అన్నీ ఒక వర్గానికే పోయాయని తమను గుర్తించలేదని వారు రగిలిపోతున్నారు. ఇప్పటి వరకూ అవకాశాలు వస్తాయేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అలాంటి పరిస్థితి లేదని ఒక్కొక్కరుగా తెర మీదకు వస్తున్నారు.
మొన్నటికి మొన్న శ్యామ్ కలకడ అనే సోషల్ మీడియా లీడర్ చనిపోతే… ఎవరూ పట్టించుకోలేదని క్యాడర్ అంతా ఒకే తాటిపైకి వచ్చి నేరుగా అధినేతనే గురి పెట్టి విమర్శలు చేశారు. దాంతో జగన్ దిగిరాక తప్పలేదు. సాయంత్రానికి ఆయన కుటుంబాన్ని పరామర్శించినట్లుగా ప్రెస్ నోట్ వచ్చింది కానీ.. ఇప్పటికీ కనీస మాత్రం సాయం కూడా అందలేదని వారు ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు.. కేవలం రెడ్డి అయినందునే అందలం ఎక్కి ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్న కొంత మంది తీరుపైనా… ఇతర కింది స్థాయి .. అవకాశాలు రాని క్యాడర్ రగిలిపోతున్నారు.
ఏపీ ప్రభుత్వ డిజిటిల్ మీడియా అంటూ జీతం తీసుకునే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి… అధికారికంగా వైసీపీకి పని చేస్తూంటాడు. ఆయన పనేమిటంటే… అందర్నీ బూతులు తిట్టడం. ఆయన ట్విట్టర్ అకౌంట్ చూస్తే.. ఇంత నోటి విరేచినాలా అని అనుకోక తప్పదు. అలాంటి వ్యక్తి గతంలో పార్టీ కోసం ఎలాంటి పని చేయలేదని.. తాము ఎంతో ఖర్చు పెట్టుకున్నా.. తమకు చాన్సివ్వకుండా.. పార్టీకి నష్టంచేస్తున్న అలాంటి వారిని నెత్తి మీద పెట్టుకున్నారని కొంత మంది ఆరోపిస్తూ లేఖలు రాయడం ప్రారంభించారు. జననేత పేరుతో ప్రత్యేకంగా జగన్ ను ఆయన కుటుంబాన్ని స్తుతించడానికి ప్రత్యేకంగా పత్రిక నడుపుతున్న కెవి సురేష్ అనే వ్యక్తి ఇదే వ్యథతో.. ఓ లేఖను విడుదల చేయడం ఇప్పుడు.. వైసీపీ వర్గాల్లో సంచలనాత్మకం అవుతోంది.
పదేళ్లు సొంత పార్టీ పెట్టి పోరాటంచేసిన జగన్‌కు చాలా మంది అండగా నిలిచారు. గెలిస్తే.. తమకు అవకాశాలు కల్పిస్తారనిఆశగా ఎదురు చూశారు. కానీ గెలిచిన తర్వాత ఓ వర్గం వారికి మాత్రమే పదవులు… ఆదాయాలు లభిస్తున్నాయి. అది వైసీపీలో అలజడికి కారణం అవుతోంది. రాను రాను ఈ అసంతృప్తి మరితం విస్తృతంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే… సంపాదించుకున్న వారే సంపాదించుకుంటున్నారు.. ఆస్తులు… భవిష్యత్‌ను త్యాగం చేసిన వారు.. ఇంకా రోడ్లపైనే ఉన్నారు. ఓపికగా ఉన్నారు.. ఇప్పుడిప్పుడే వారి ఓపిక .. సహనం నశిస్తోంది.