కె. రామచంద్రమూర్తి…. తెలంగాణ వాసి. జగన్మోహన రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు. దేవులపల్లి అమర్….. తెలంగాణ పోరాటాల గడ్డ కరీంనగర్ వాసి. జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలో జాతీయ మీడియా సలహదారుడు. చలపతిరావు…. తెలంగాణలో పుట్టిన సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన రెడ్డి సొంత పత్రిక సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్.
పరిమళ్ నత్వాని…. గుజారాత్ లోని జమ్ కంబాలియా పట్టణ వాసి. జగన్మోహన రెడ్డిని ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీ రాజ్యసభకు పంపాల్సిందిగా అడిగిన అభ్యర్ధి. వీరంతా ఆంధ్రప్రదేశ్ తో ఏమాత్రం సంబంధం లేని వారు. మొదటి ముగ్గురు అయితే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా రాతలు రాయడమే కాదు… ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి కంచాల్లో పెట్టి పదవులు అందజేశారు.
ఈపాటి పదవులకు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రాజకీయ నాయకుడు కాని, జర్నలిస్టులు కాని లేరా అన్నది ఇప్పుడు అటు ఏపీలోను, ఇటు తెలంగాణలోనూ కూడా జరుగుతున్న చర్చ. అయిన వారికి ఆకుల్లోను, కాని వారికి కంచల్లోను పెడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాదు… పార్టీలో కూడా వ్యతిరేకత వస్తోంది. ఇప్పుడు తాజాగా పారిశ్రామిక వేత్త, అదీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండి ప్రభుత్వాలను శాసించే ముఖేష్ అంబానీ నేరుగా తన మనిషికి రాజ్యసభ సభ్యత్వం కోరితే కాదనే ధైర్యం చేయరని అంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదం కావడం పార్టీ శ్రేణులను సైతం విస్మయపరుస్తోంది. ఏడాది
పూర్తి కాకుండానే ఇలా ఉంటే వచ్చే నాలుగేళ్లు ఇంకెతమంది బయట వారికి ఈ పదవుల పందారం ఉంటుందోనని పార్టీశ్రేణులు ఆందోళన చెందుతున్నారంటున్నారు.