ఆంధ్ర ప్రదేశ్లో పాలకపక్షంగా వున్న టిడిపి నేతలపై ఎంఎల్ఎలు ఎంపిలపై అనేక ఆరోపణలు వివాదాలు వచ్చాయి. అయినా ఇంతవరకూ చెప్పుకోదగిన ఏ నాయకుడిపైనా చర్య తీసుకునేంతవరకూ వెళ్లింది లేదు. ఏదో సర్దిచెప్పడం ద్వారా సాంకేతిక వివరణల ద్వారా ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెట్టుకొస్తున్నారు. కాని ఇప్పుడు తెలుగు దేశం నేతలపై బయిట రాష్ట్రాల్లో కుంభకోణాలు ఆరోపణలు వస్తుంటే ఏం చేయాలో తోచని స్థితి. హైదరాబాద్ భూ భాగోతంలో టిడిపి ఎంఎల్సి దీపక్ రెడ్డి అరెస్టయిన తర్వాత సస్పెండ్ చేశారు. కాని ఆయనే గాక మరికొందరి పేర్లు కూడా ఆ వ్యవహారంలో వేచిచూస్తున్నాయి. ఇక ఇప్పుడు ఉదయగిరి ఎంఎల్ఎ బొల్లి రామారావు పేరు మహారాష్ట్రలో ఆరోపణలకెక్కింది. తానేమీ తప్పు చేయలేదని ఆయన సమర్థించుకుంటున్నారు గాని చర్యలు తప్పేట్టు లేవు. ఇక సదావర్తి భూములు కావడానికి ఎపికి చెందినవైనా సమస్య ఉత్పన్నమైంది మాత్రం అక్కడే. తెలుగుదేశం ఇప్పుడు జాతీయ పార్టీ గనక వాళ్లు జాతీయ స్థాయికి ఎదగడం సంతోషమే కదా! దీన్ని మరో విధంగా కూడా చెప్పొచ్చు.రాష్ట్రంలోనైతే ప్రభుత్వం తమదే గనక తప్పించుకుంటున్నారు అదే ఇతర చోట్ల కుదరక దొరికిపోతున్నారు అని. ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎపిమంత్రి ఒకరి పేరు వుందని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.