వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలే తేడాగా ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసుల్ని నమ్ముకుని అక్కడ డేటా చోరీ అంటూ అనేక రకాల కేసులు పెట్టించి ఏపీ అధికార పక్షాన్ని ఓ ఆట ఆడుకున్న వైసీపీ ఇప్పుడు ఏపీ పోలీసులే తమ చేతులో ఉండటంతో ఏం చేయగలదో అది చేసి చూపిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాలకు ఏపీ నుంచి వెళ్తున్న గంజాయి వ్యవహారంలో అక్కడి పోలీసులు ఏపీ నుంచి వస్తుందని చెప్పడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. వారంతా చంద్రబాబు కుట్రలో భాగస్వాములని.. ఆరోపించడం ప్రారంభించారు.
హైదరాబాద్ కమిషనర్ తో పాటు నల్లగొండ ఎస్పీ కూడా ఏపీ నుంచి గంజాయి వస్తోందని ఇటీవల స్పష్టంగా ప్రకటించారు. మ్యాప్లు చూపించి మరీ ఎలా వస్తుందో చెప్పారు. వీళ్లిద్దరే కాదు ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల పోలీసులూ అదే చెప్పారు. ఇప్పుడు వీళ్లందర్నీ షరా మామూలుగా టీడీపీ ఏజెంట్లు.. చంద్రబాబుతో కలిసి కుట్ర చేశారంటూ ఆరోపణలు ప్రారంభిచేశారు వైసీపీ పార్టీ నేతలు. ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి విజయసాయిరెడ్డి ఇదే చెప్పారు. పైగా తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆధారాలు లేకుండానే రాత్రికి రాత్రి టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కానీ ఆధారాలుంటే ఎందుకు ప్రెస్మీట్ పెట్టారో ఆయన చెప్పలేకపోయారు.
తమ ప్రతి వైఫల్యానికి చంద్రబాబు కారణంగా చెప్పడం వైసీపీ విధానాల్లో ఒకటి. అయితే రాష్ట్రంలో వరకు అయితే సరే ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు కూడా చంద్రబాబు కుట్రలో భాగస్వాములు అని చెబితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏపీలోని పోలీసులే ఇప్పుడు చంద్రబాబు మాట వినడం లేదు. ఇక పక్క రాష్ట్రాల పోలీసులు వింటారా…? ప్రజల్ని.. యువతను నిర్వీర్యం చేస్తున్న ఓ మహమ్మారి గురించి పట్టించుకోకుండా వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై కుట్ర సిద్ధాంతాలు వల్లిస్తూ వైసీపీ రాజకీయం చేస్తోంది. అందు కోసం ఆ కేసుల్ని బయట పెడుతున్న పోలీసుల్ని సైతం వదిలి పెట్టడం లేదు.