ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నామొన్నటి వరకూ దేశం మొత్తం ఓ రకమైన మంచి అభిప్రాయం ఉండేది. హుదూద్ లాంటి విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న తీరు ఆంధ్రాలకు సొంత మని అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మరి ఇప్పుడు . ఓ మాదిరి తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిద్రపోతోందని పొరుగు రాష్ట్ర ఎంపీ ఒకరు సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. ఇది ఏపీ పరువు తీసేలా దేశం మొత్తం హైలెట్ అవుతోంది.
ఓ వైపు తుపాను – సెకండ్ సాటర్డే అని పడుకున్న ప్రభుత్వం !
సీఎం జగన్ ఉక్కు పరిశ్రమలకు శంకుస్థాపన చేసి మూడున్నరేళ్లు దాటుతున్నా కనీస పనులు ప్రారంభించలేదు. దానిపై కడపలో సీపీఐ నేతలు పాదయాత్ర చేస్తున్నారు. దీన్ని ప్రారంభించేందుకు వచ్చిన సీపీఐ రాజ్యసభ ఎంపీ బినోయ్ విశ్వం… తుపాన్ పరిస్థితులతో అక్కడే ఆగిపోయారు. కడపలో వర్షాల వల్ల చాలా మంది జనం ఇబ్బంది పడుతున్నారు.. అధికారులు కనిపించడం లేదని ఆయన కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేరు. కంట్రోల్ రూమ్ లేదు. ఒక్క ఉద్యోగి ఉంటే.. ఆయనను అడిగారట.. అందరూ ఏమయ్యారు అని. ఆ ఉద్యోగి కూడా ఎగాదిగా చూసి ఈ రోజు సెకండ్ సాటర్డే అని సమాధానం ఇచ్చారు. దాంతో బినోయ్ విశ్వం.. అయితే తుపాన్లకు సమాచారం ఇవ్వండి.. కేవలం వర్కింగ్ డేస్‌లోనే రమ్మని అని సమాధానం ఇచ్చి వచ్చేశారు. దాన్నే సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడీ ఘటన వైరల్ అవుతోంది. ఏపీ మొహం మీద నవ్వే పరిస్థితి వచ్చింది.
ఏపీలో పూర్తిగా పడకేసిన పాలన !
ఏపీలో పాలన అనేది ఉందని ఎవరూ అనుకోవడం లేదు. కరోనా వచ్చినా.. ప్రకృతి విపత్తులు వచ్చినా ఎవరి సావు వారు సస్తారన్నట్లుగా ప్రభుత్వం వదిలేసింది. అంత పెద్ద అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి వంద శాతం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. తిరుపతిని వరదలు ముంచెత్తినా… వేల మంతి నిరాశ్రయులైనా అదే కారణం. పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిలయింది. సీఎం జగన్ సమీక్షలు చేసి.. ఆ సమీక్షల్లో ఏం చెప్పాలో సజ్జల రామకృష్ణారెడ్డి అనే సలహాదారు రాసిచ్చినవి మాత్రమే చదువుతారు. మిగతా అంతా ఆయనే నడుపుతారు. ఇతర విషయాలను పట్టించుకోరు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు తలా రూ. రెండు వేలు ఇవ్వడం అని ఘనంగా ప్రకటిస్తారు. అంతకు మించి చేసేదేమీ ఉండదు. పోనీ ఈ రెండు వేలు అయినా ఇస్తారా అంటే.. ఇచ్చామని ెప్పుకోవడానికి ఓ పది.. ఇరవై మందికి ఇస్తారు.
పరిశ్రమల్ని వెళ్లగొట్టే ఏకైక రాష్ట్రంగా గుర్తింపు !
దేశంలో ప్రతీ చిన్న రాష్ట్రం పరిశ్రమల కోసం రెడ్ కార్పెట్ వేస్తుంది. కానీ ఏపీలో మాత్రం ఉన్న పరిశ్రమల్ని వేధించి బయటకు పంపేస్తారు. ఇలాంటివి ప్రత్యక్షంగా చాలా జరిగాయి. ఏపీలో ఈ పరిస్థితుల్ని చూసి పొరుగు రాష్ట్రాలే కాదు.. ఉత్తరాది పారిశ్రామికవేత్తలు కూడా .. నవ్వుతున్నారు. బడా పరిశ్రమల్ని తరలించేసి.. బినామీ పేర్లతో కంపెనీలు పెట్టి.. వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటనలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇదంతా కళ్ల ఎదుటే ఉంది. అందుకే ఏపీ నవ్వుల పాలవుతోంది.
ఇతర రాష్ట్రాల ముందు పోతున్న పరువు !
గత మూడున్నరేళ్ల నుంచి ఏపీ ఇతర రాష్ట్రాల ముందు చిన్న బోతోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ చేసే వెక్కిరింతల గురించి చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ, కర్ణాటక ప్రజలు సోషల్ మీడియాలో చేసే వెటకారాలు మామూలుగా ఉండవు. సొంత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసుకునే ప్రభుత్వం గురించి… ప్రజా వేదిక కూల్చినప్పటి నుండి ఉత్తరాదిలో జోకులు ఉన్నాయి. అటు ప్రజల్నీ పట్టించుకోవడం లేదు. విపత్తులొచ్చినప్పుడు బతికి ఉన్న వాళ్లను తమ శ్రమ వల్లే బతికి ఉన్నారని చెప్పుకోవడానికి తప్ప.. ప్రజల ఆస్తులను కాపాడే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ప్రాణాలు సంగతి సరేసరి. మరీ ఇంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని ఊరకనే అనరు.