వన్ టై సెటిల్మెంట్ పేరుతో పేదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా మోసం చేస్తోందన్న అనుమానాలు బలపరిచే మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులే రిజిస్ట్రేషన్ చేసేస్తారని.. వారికి సేల్ డీడ్ ఇస్తామని.. వాటిని ఏ బ్యాంకులో అయినా తాకట్టు పెట్టుకోవచ్చని.. ఎవరికైనా అమ్ముకోవచ్చని ఏపీ సర్కార్ చెబుతోంది. అందుకే.. రూ. పది.. ఇరవేలు వసూలు చేస్తున్నామని చెబుతోంది. కానీ ఆ డాక్యుమెంట్లు చెల్లవన్న అభిప్రాయం .. న్యాయవర్గాల్లో వినిపిస్తోంది.
ఇండియన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లపై పార్టీ ముద్రలు.. సీఎం బొమ్మలు ఉన్నాయి. అంతే కాదు సబ్ రిజిస్ట్రార్లు చేసే వాటికి మాత్రమే చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుంది. గ్రామ కార్యదర్శులూ చేయవచ్చని జీవో ఇచ్చినంత మాత్రాన వారు చేస్తే చెల్లవు. చట్టం మార్చాల్సి ఉంటుంది. అయితే ఆ చట్టం రాష్ట్ర పరిధిలో మాత్రమే ఉండదు. కేంద్రం కూడా ఆమోదించాలి. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రి… ఓటీఎస్ లబ్దిదారులకు ఇస్తున్నది సేల్ డీడ్ కాదని.. ఎనీ డాక్యుమెంట్ అని నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
రూ. పది.. ఇరవై వేలు కట్టిన పేదలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే సమయంలో హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. లేకపోతే ప్రజలు మోసపోయామనే భావనకు వస్తారు. ప్రభుత్వం ఇస్తున్న డాక్యుమెంట్లు, పత్రాలు ఎందుకూ పనికి రాకపోతే… డబ్బులు కట్టించుకున్నందుకు లబ్దిదారులు తర్వాత తిరగబడతారు. ఇప్పుడు ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
సేల్ డీడ్ ఇస్తే ప్రజలు అమ్మేసుకుని రోడ్డున పడతారని. అందుకే జాగ్రత్తగా ఉండేలా డాక్యుమెంట్ ఇస్తున్నామని… ప్రజలకు మేలు చేస్తూంటే అడ్డుకుంటున్నారని విపక్షాలపై విరుచుకుపడే టెక్నిక్ వారి దగ్గర సహజంగానే ఉంటుంది. కానీ మద్యం ధరల పెంపు దగ్గర్నుంచి ప్రజలకు చేస్తున్న మేలు గురించి అందరికీ క్లారిటీ వచ్చేస్తోంది. అందుకే నిరుపేదల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్ముల విషయంలోనూ అయినా ప్రభుత్వం పారదర్శకత పాటించాల్సి ఉంది .