మార్కెట్ని బట్టి వ్యూహాలు మార్చుకోవాల్సిందే. కొత్త నిబంధనల్ని సృష్టించుకోవాల్సిందే. ఓటీటీ సంస్థలు ఇప్పుడు అదే చేయబోతున్నాయి. థియేటర్లు లేని లోటు కొంత వరకూ పూడ్చుతున్నాయన్న మాటే గానీ, సినిమా వల్ల ఓటీటీలకు ఒదిగిందేం లేదు. యాధృచ్చికమో ఏమో, ఓటీటీలో విడుదలైన సినిమాలన్నీ ఫట్టుమన్నాయి. ఒకట్రెండు `బాగానే ఉన్నాయి` అనే టాక్ సంపాదించుకున్నా, వ్యూవర్ షిప్ పెద్దగా లేదు. దాంతో.. సినిమాల వల్ల నష్టపోకూడదని భావిస్తున్న ఓటీటీ సంస్థలు ఇప్పుడు నిర్మాతల ముందు కొత్త రూల్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాయి.
ఇది వరకు సినిమాల్ని సింగిల్ పేమెంట్ తో కొనేసేవి. స్ట్రీమింగ్ కి ముందే పేమెంట్ క్లియర్ అయిపోయేది. ఇప్పుడు అలా కాదు.. 50- 50 పద్ధతిన సినిమాలు కొంటామంటున్నాయి. ముందు సగం పేమెంట్, స్ట్రీమింగ్ అయ్యాక, కొన్ని రోజులకు మిగిలిన సొమ్ము ఇస్తాయి.
శాటిలైట్ ఛానళ్ల మైండ్ సెట్ ని ఓటీటీలు కొంత వరకూ అలవరచుకుంటున్నాయి. శాటిలైట్ ఛానళ్లన్నీ సినిమాల్ని చూసే కొంటున్నాయి. ఇప్పుడు ఓటీటీలూ అదే దారిన వెళ్తున్నాయి. సినిమా చూసి, నమ్మకం ఏర్పడితే డీల్ సెట్ చేసుకుంటున్నాయి.
థియేటర్లో సినిమా విడుదలైనప్పుడు బయ్యర్కి ఎంజీ (మినిమం గ్యారెంటీ) ఉన్నట్టే.. ఓటీటీలోనూ మినమం గ్యారెంటీ ఇవ్వాలి. అంటే…కనీసం ఇంతమంది చూస్తారు అనే షరతు మీద సినిమాలు కొనబోతున్నాయి. లక్షమంది సినిమా చూస్తారు అని నిర్మాతలు మాటిస్తే.. లక్షా చూడాల్సిందే. దానికంటే తగ్గితే, కొంత మేర సొమ్ము వెనక్కి ఇవ్వాల్సివస్తుంది.
వ్యూస్ పద్ధతిన కూడా రేటు మారబోతోంది. ముందు కొంతమేర నిర్మాతలకు డబ్బులు ఇచ్చేసి, వ్యూస్ బాగుంటే, వ్యూకి ఇంత చెప్పున అదనంగా కట్టబెడతారు. ఈ పద్ధతి ఉభయతారకంగా కనిపిస్తుంది. సినిమా బాగుంటే అటు నిర్మాతకూ, ఇటు ఓటీటీ సంస్థకూ లాభమే.