లాక్ డౌన్ సమయాన్ని క్యాష్ చేసుకున్నది ఓటీటీ వేదికలే.. అంటూ రామ్ గోపాల్ వర్మ ఓ జోక్ పేల్చాడు ట్విట్టర్లో. నిజానికి అది జోక్ కాదు. వాస్తవం. లాక్డౌన్ సమయంలోనూ కాసులు కురిపించుకుంటున్నాయి ఓటీటీ వేదికలే. అవి లేకపోతే.. సామాన్య జనం ఏమైపోదురో. వారం వారం ఓ కొత్త సినిమా చూడాలనుకునే ప్రేక్షకుడికి టైమ్ పాస్ లేక పిచ్చెక్కిపోయేవాడు. అవసరాన్ని, డిమాండ్‌నీ గమనించిన ఓటీటీ సంస్థలు కావల్సినంత సంఖ్యలో సినిమాల్నీ, వెబ్ సిరీస్‌లనూ అప్ లోడ్ చేసి థియేటర్లు లేని లోటు తీరుస్తున్నాయి.
లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే – ఎవరికి పని దొరికినా దొరక్కపోయినా రచయితలు, దర్శకులకు ఓటీటీ వేదికలు బోలెడంత పని కల్పించడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే వాళ్ల చేతుల్లో ఉన్న వెబ్ సిరీస్‌లు అయిపోయాయి. దాదాపుగా అన్నింటినీ అప్ లోడ్ చేసేశారు. ఇప్పుడు వాళ్లకు కొత్త కంటెంట్ అవసరం. ఒకట్రెండు నెలల్లో వీలైనంత కంటెంట్ ని ఓటీటీలో చూపించుకోవాలి. లేదంటే కొత్త కష్టమర్లని పట్టుకోవడం చాలా కష్టం. షూటింగులకు అనుమతి వచ్చాక… సినిమా వాళ్లు రెడీ అవుతారో లేదో గానీ, ఓటీటీ సంస్థలు మాత్రం లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగులు మొదలెట్టుకోవడానికి స్క్రిప్టులు రెడీ చేసుకుంటున్నాయి. ఇది వరకు హోల్డ్ లో పెట్టుకున్న కొన్ని స్క్రిప్టులు ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయి. ఆహా, జీ 5, అమేజాన్, హాట్ స్టార్ లాంటి సంస్థలు ఇప్పుడు కొత్త దర్శకులకు కాంటాక్ట్ లోకి వెళ్తున్నాయి. స్క్రిప్టులు రెడీ చేసుకోమని ప్లానింగులు ఇస్తున్నాయి.
ఇది నిజంగా దర్శకులకు, రచయితలకు సువర్ణావకాశం అనే చెప్పాలి. ఇప్పుడు ఓటీటీకి కంటెంట్ కావాలి. దానికి కావల్సిన బడ్జెట్లు, స్టార్ కాస్టింగ్ ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు రెడీగా ఉన్నాయి. తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసి, ఇప్పుడు ఖాళీగా ఉన్నదర్శకులందరినీ ఆమేజాన్, హాట్ స్టార్, ఆహా లాంటి సంస్థలు దగ్గరకి చేరుస్తున్నాయి. వాళ్లతో అతి వేగంగా వెబ్ సిరీస్‌లను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది వరకు రిజెక్ట్ చేసిన కథల్ని కూడా ఇప్పుడు ఓకే అనుకుంటున్నారంటే… ఓటీటీలో కంటెంట్ డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవొచ్చు. అందుకే నవతరం దర్శకులు, రచయితలు సినిమాలకంటే వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టడం మేలు.