థియేటర్లని మూసివేసిన తరుణంలో… ఓటీటీలు కల్ప తరువులుగా మారాయి. థియేటర్లు తెరచుకున్నా సరే, విడుదల కాని సినిమాలు సైతం ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. ఓ రకంగా నిర్మాతల్ని ఒడ్డున పడేశాయి. అయితే ఆరంభంలో విరివిగా చిన్న సినిమాల్ని కొనేసిన ఓటీటీలు, వాటి వల్ల ఏ ప్రయోజనం లేదని తెలుసుకుని ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లైతే…చిన్న సినిమాల్ని దరిదాపులకు కూడా రానివ్వడం లేదు. స్టార్ కాస్టింగ్ లేకపోతే.. వాటిని పట్టించుకోవడం లేదు. కొంతమంది నిర్మాతలు ముందే చేసుకున్న ఒప్పందాల మేరకు.. ఓటీటీల్లో చిన్న సినిమాలు కొన్నయినా కనిపిస్తున్నాయి గానీ, నిజానికి వాటిని ఓటీటీలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశాయి.
ఇటీవల కొన్ని సినిమాలు అమేజాన్, నెట్ఫ్లిక్స్లలో కనిపించాయి. అయితే.. వాటికి రావల్సిన ఫండ్స్ ఇప్పటి వరకూ ఆయా ఓటీటీ సంస్థలు విడుదల చేయలేదు. చాలా తక్కువ మొత్తానికి సినిమా కొన్నా సరే.. మూడు వాయిదాలలో ఆ డబ్బుల్ని చెల్లిస్తున్నాయి. ఆ మూడు వాయిదాలు కూడా… ఓటీటీల ఇష్టమే. ఓటీటీ సబ్ స్క్రైబర్లు సినిమాని ఫ్రీగానే చూసినా.. నిర్మాతలకు మాత్రం `పే పర్ వ్యూ` పద్ధతిన ఆదాయం లభిస్తోంది. ఎంత మంది చూస్తే అన్ని డబ్బులు. ఆ డబ్బుల్ని సైతం.. ఓటీటీలు ఇప్పుడ ఒకేసారి ఇవ్వడం లేదు. ఓటీటీ ద్వారా అయినా సరే, ఎంతో కొంత తిరిగి వచ్చిందన్న… ఆనందం, తృప్తి చిన్న నిర్మాతలకు కలగడం లేదు. ఓటీటీలకు ఇచ్చేసి, వాళ్ల నుంచి డబ్బులు రాక, ఇప్పుడు వాటిని థియేటర్లకు విడుదల చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది నిర్మాతలు బాధ పడుతున్నారు.
ఈ ఎఫెక్ట్ పెద్ద సినిమాలపైనా పడింది. ఇది వరకు పెద్ద సినిమాల్ని సింగిల్ పేమెంట్ తో సెటిల్ చేసిన ఓటీటీ సంస్థలు.. ఇప్పుడు మాత్రం వాళ్లకీ మూడు వాయిదాల పద్ధతిన డబ్బులు చెల్లిస్తున్నారు. పైగా.. `సినిమా చూశాకే కొంటాం` అంటూ కొత్త నిబంధన జోడిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో సినిమా అమ్మడం కూడా నిర్మాతలకు ఓ ఛాలెంజ్ గా మారిపోయింది.