ఈనెల 23 నుంచి తెలంగాణలో థియేటర్లు తెరచుకోబోతున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో. అయితే… సినిమాలు రావడం కాస్త ఆలస్యం అవుతుంది. ఈనెలాఖరున `తిమ్మరుసు`తో టాలీవుడ్ లో హంగామా మొదలు కానుంది. ఏపీలో థియేటర్లు తెరచుకోవడం విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ లేదు. అందుకే ఈ వారం కూడా.. వినోదం కోసం ఓటీటీల వైపే చూడాల్సివస్తోంది. ఈ వారం ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
ఈనెల 20న `నారప్ప`తో హడావుడి మొదలు కానుంది. వెంకటేష్ – ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమాని చూడొచ్చు. 21న `ఇక్కత్` (కన్నడ)ని అమేజాన్లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఆర్య నటించిన తమిళ చిత్రం `సర్పట్ట` ఈనెల 22న అమేజాన్ లో వస్తోంది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా అదే రోజున రాబోతోంది. 23న హాట్ స్టార్ లో `హంగామా 2` స్ట్రీమ్ అవుతుంది. హంగామా సినిమా సూపర్ హిట్ కావడంతో, ఆ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో `హీరో` పేరుతో డబ్ చేశారు. ఆహాలో ఈ సినిమాని ఈనెల 24 నుంచి చూడొచ్చు.