చిత్రసీమ అసలే ఇబ్బందుల్లో ఉంది. మూలిగే నక్కపై తాటి కాయ పడినట్టు… మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. థియేటర్ల బంద్ నేపథ్యంలో ఓటీటీ లో విడుదల కాస్త ఓదార్పుగా కనిపిస్తోంది. థియేటరికల్ రైట్స్ నుంచి ఆశలు వదులుకున్న నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారు. దాని ద్వారా ఎంతో కొంత సొమ్ము చేసుకోగలిగితే చాలు, అనే లెక్కలు వేస్తున్నారు. అయితే శాటిలైట్ హక్కులు వాళ్ల ముందరి కాళ్లకు బంధమేస్తోంది.
సినీ నిర్మాతలకు శాటిలైట్ హక్కుల ద్వారా ఎంతో కొంత గ్యారెంటీ సొమ్ము లభించేది. ఫ్లాప్ హీరోల సినిమాలకు సైతం మినిమం గ్యారెంటీగా కొంత సొమ్ము వెనక్కి వచ్చేది. ఇప్పుడు నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారు. దాని ద్వారానూ కొంత ఆదాయం గ్యారెంటీగా లభిస్తోంది. ఓటీటీ ద్వారా కొంత, శాటిలైట్ ద్వారా ఇంకొంత ఆదాయం సమకూర్చుకుంటే – థియేటరికల్ రైట్స్ దెబ్బ తిన్నా కూడా నిర్మాత గట్టెక్కేయగలడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమాని ఓటీటీకి అమ్ముకుంటే శాటిలైట్ రైట్స్ దక్కడం లేదు. మీరు సినిమాని ఓటీటీలో విడుదల చేసుకునే ఉద్దేశం ఉంటే, ఇక శాటిలైట్ హక్కులు మాకొద్దు.. అని కొన్ని ఛానళ్లు తెగేసి చెబుతున్నాయట. నేరుగా ఓటీటీలో విడుదల చేసుకునే సినిమాలకైతే శాటిలైట్ మార్కెట్ జీరో అయిపోయింది. లాక్ డౌన్‌కి ముందు కొన్ని సినిమాలు శాటిలైట్ హక్కుల్ని అమ్ముకున్నాయి. అడ్వాన్సులు కూడా నిర్మాతలకు అందాయి. అవన్నీ ఇప్పుడు ఓటీటీలో ప్రదర్శనకు రెడీ అవుతున్నాయి. థియేటరికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో సినిమా విడుదలైతే, శాటిలైట్ హక్కులు మాకొద్దు, ఆ అడ్వాన్సులు వెనక్కి తిరిగి ఇవ్వండి అంటూ.. టీవీ ఛానళ్లు నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కాని పక్షంలో.. ఆయా సినిమాల్ని శాటిలైట్‌లో, ఓటీటీలో ఒకేసారి ప్రదర్శనకు అనుమతి ఇవ్వమని కోరుతున్నాయి. అలాంటప్పుడు ఓటీటీ సంస్థలు సినిమాల్ని ఎందుకు కొంటాయి? దాంతో అటు శాటిలైట్ ఛానళ్లకు డబ్బులు తిరిగి కట్టలేక, ఇటు ఓటీటీని వదులుకోలేక ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు. మధ్యే మార్గంగా ఓటీటీలో విడుదలైన నెల రోజులకు శాటిలైట్ లోనూ సినిమాని ప్రదర్శించుకునే ఒప్పందంపై ఇరు పక్షాలూ అంగీకారానికి వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి ఓటీటీ వల్ల శాటిలైట్ హక్కులకు గండి పడినట్టైంది.