జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి, బిజెపికి ఉన్న తేడా ఏంటి? అలాగే రాష్ట్రాల స్థాయిలో టిడిపి, టిఆర్ఎస్, వైసిపిలకు ఉన్న తేడా ఏంటి? అసలు ఈ పార్టీల మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయా? ఒకే ఒక్క తేడా ఉంది. చేసిన, చేస్తున్న తప్పులను కప్పిపుచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టిన నాయకులుగా ప్రమోట్ చేయడానికి అవసరమైన మీడియా బలం నరేంద్రమోడీకి, చంద్రబాబుకు ఉంది. మిగతా నాయకులకు అది లేదు. అదే తేడా. మిగతా అంతా సేం టు సేం. పరిటాల రవి మర్డర్ జరిగిన మరుక్షణం నుంచి కూడా జెసి దివాకర్రెడ్డిపైన చంద్రబాబు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. వైఎస్ కుటుంబంతో పాటు జెసి కూడా ఫ్యాక్షనిస్ట్, రాక్షసుడు, క్రిమినల్ అయిపోయాడు. కట్ చేస్తే అదే జెసీ 2014లో టిడిపిలో చేరగానే పునీతుడు అయిపోయాడు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే పరిటాల సునీత కూడా జెసీతో సర్దుకుపోవడం. అంటే పరిటాల రవి మర్డర్ చుట్టూ దాదాపు దశాబ్ధం పాటు టిడిపి ఆడినవన్నీ రాజకీయ డ్రామాలేనా? లేకపోతే అధికారం కోసం ఏం చేయడానికైనా, ఎలాంటి వాళ్ళనైనా పార్టీలో చేర్చుకోవడానికి రెడీనా?
మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్ తివారి…..ఇలా చెప్తే వెంటనే గుర్తుకు రావడం కష్టం. ఆ మధ్య ఆంధ్రజ్యోతి మీడియాలో రాజ్‌భవన్‌లో రాసలీలలు అంటూ తెలుగు వాళ్ళందరికీ ఓ ముసలి రసికుడు పరిచయమయ్యాడు చూడండి. గుర్తొచ్చిందా? అప్పట్లో ఆంధ్రజ్యోతి, టిడిపిలు కలిసి ఎన్డి తివారి విషయంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జాతీయ స్థాయిలో కూడా హల్చల్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు అదే ఎన్డీ తివారి టిడిపి మిత్రపక్షమైన బిజెపి పార్టీ లీడర్. స్వయానా అమిత్‌షానే వెళ్ళి కండువా కప్పేశారు. ఇక ఇప్పుడా ముసలి నేత పునీతుడు అయిపోయినట్టేనా? వైఎస్ జగన్ జైలులో ఉండగా వచ్చిన బై ఎలక్షన్స్ టైంలో సాక్షిలో పొద్దస్తమానం ఒక పాట వచ్చేది. ‘పెద్దాయన…పెద్దాయన…’ అంటూ చిన్నపిల్లలు కూడా కామెడీగా పాడుకునేంతలా ఆ పాటను అరిగిపోయిన రికార్డులాగా పదే పదే టెలికాస్ట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ వీడియో కనిపించిన ముఖాలు వైసిపీలోనే ఉన్నాయి. త్వరలో ఆ మిగిలిన వాళ్ళు కూడా వైసిపిలోనే చేరబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి ఆ పెద్దాయన ఆత్మ క్షోభను గాలికి వదిలేసినట్టేనా? ఇక టీఆర్ఎస్ది కూడా సేం టు సేం స్టోరీ. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం తనతో కలిసి పోరాడిన జెఎసి ఛైర్మన్ కోదండరాం మాత్రం తెలంగాణా ద్రోహి అయిపోయాడు. తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అక్కినేని నాగార్జున, రామోజీరావు, రాధాకృష్ణ, జగన్….ఓటుకు నోటు కేసు తర్వాత నుంచి చంద్రబాబు……..ఇంకా ఉద్యమ కాలంలో తెలంగాణా ద్రోహులని అనిపించుకున్న ఎంతో మంది తెలంగాణా మిత్రులయిపోయారు. అంతా కల్వకుంట్ల కుటుంబం మహత్యం.
పొద్దున్న లేస్తే విలువలు, విశ్వసనీయత అంటూ మొత్తం సమాజానికి నీతులు చెప్తూ ఉంటారు. కానీ వాటి గురించి అస్సలు తెలియని వాళ్ళు మన నాయకులే. అధికారం, డబ్బు తప్ప మన నాయకులకు తెలిసిన విలువలు, పాటించే విలువలు వేరే ఏవైనా ఉన్నాయా?