గ్రామ సచివాలయ ఉద్యోగాల పేరుతో లక్షన్నర మందికి ఆరు నెలల్లోనే పర్మినెంట్ ఉద్యోగాలిచ్చామని… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు వారిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించేందుకు… చకచకా పావులు కదుపుతున్న సూచనలు కనిపిస్తున్నారు. అక్టోబర్ రెండు నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చారు. అప్పుడే..ఉద్యోగులకు నియామకపత్రాలు అందించారు. అయితే.. మూడు నెలలు గడుస్తున్నా.. వారికి ఇంతవరకూ ఒక్క నెల కూడా జీతం ఇవ్వలేదు. జనవరి ఒకటో తేదీకి అయినా జీతాలు ఇవ్వకపోతే.. ప్రభుత్వంపై నమ్మకం పోతుందన్న ఉద్దేశంతో.. ప్రభుత్వం ఎలాగోలా వారికి జీతాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
వారివి పర్మినెంట్ ఉద్యోగాలు అని చెప్పిన సర్కార్.. జీతాలు మాత్రం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితాలో చేర్చి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు జిల్లాల అధికారులు.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి… జీతాలను.. 301, 302 ఖాతాల కింద పంపాలని.. ఆదేశాలు వెళ్లాయి. ఈ ఖాతాల కింద.. ఔట్ సోర్సింగ్, ఒప్పంద ఉద్యోగులకు మాత్రమే జీతాలు ఇస్తాయి. ఒక సారి ఉద్యోగుల్ని ఈ ఖాతాల కింద చూపితే.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మినెంట్ ఉద్యోగులు కారు., వారు ఔట్ సోర్సింగ్ కింద వస్తారు., తర్వాత ప్రభుత్వం విడిగా పర్మినెంట్ చేయడానికి ప్రత్యేకమైన కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకే.. జిల్లాల అధికారులు.. ఆయా ఖాతాల కింద ఉద్యోగులు బిల్లులు పెట్టేందుకు జంకుతున్నారు.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 010 ఖాతా కింద… జీతాలు పంపిణీ చేస్తారు. ఇలా చేయడం వల్ల.. ఒకటో తేదీన వారికి జీతం అందుతుంది. ఖాజానాలో నిధులుంటే… జీతాలు ఆలస్యం కావు. కానీ ఇతర ఖాతాల కింద ఉంటే మాత్రం.. ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తుంది. దీంతో.. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్లకు ఈ విషయంపై విజ్ఞాపన పత్రాలు అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే జీతాలు చెల్లించాల్సి ఉంది. అలాగే.. గ్రామ సచివాలయ ఉద్యోగులకూ చెల్లించాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి మాత్రం.. అంత అనుకూలంగా లేదు.