ఆంధ్రప్రదేశ్ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 10,093 పాజిటివ్ కేసులు నమోదయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రోజులో చనిపోయిన వారి సంఖ్య 65గా ఉంది. ఒక్క రోజులో కేసులు.. మరణాలు.. అదే పనిగా పెరిగిపోతూ వస్తున్నాయి. అత్యధిక జిల్లాల్లో కేసులు వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా ఆందోళనకర స్థాయిలో విస్తరించింది. నిన్న విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 53 కేసులు నమోదయ్యాయి.
అయితే.. కేసుల సంఖ్య పెరగడానికి టెస్టుల సంఖ్య పెంచడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. నిన్నటిదాకా.. రోజుకు యాభై వేల టెస్టులు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వం.. ఇప్పుడు ఆ సంఖ్యను 70వేలకు చేర్చింది. 70584 టెస్టులను ఒక్క రోజులో చేశామని ప్రకటించింది. ఇందులో 37119 యాంటీజెన్ టెస్టులు కాగా.. వీఆర్డీఎల్, ట్రూనాట్ టెస్టుల ద్వారా 33385 మందిని పరీక్షించినట్లుగా ప్రకటించింది. ఇంత భారీ స్థాయిలో టెస్టులు చేయడం వల్లనే.. ఎక్కువగా కేసులు వెలుగులోకి వస్తున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.
దేశం మొత్తం ప్రస్తుతం కరోనా తిరోగమన దేశలో ఉంది. కొన్నాళ్ల క్రితం.. కరోనా విజృంభించిన ఢిల్లీ .. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తీవ్రత తగ్గింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అనూహ్యంగా పెరిగిపోతోంది. ప్రభుత్వ పెద్దలు కూడా.., వైరస్‌తో కలిసి జీవించాలని సలహాలు ఇస్తున్నారు. ఓ వైపు మద్యం దుకాణాలు.. మరో వైపు అధికారిక కార్యక్రమాలు యథావిధిగా సాగుతూండటంతో… కరోనాకు పట్టపగ్గాల్లేకుండా అయిపోయినట్లయింది. కేసులు ఇదే స్థాయిలో నమోదయితే… ఏపీలోవైద్య సౌకర్యాల కొరత ఏర్పడి.. దారుణమైన పరిస్థితులు ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.