ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. వరుసగా మూడో రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 75,720 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే. ముంబై లాంటి మహానగరం ఉన్న మహారాష్ట్రలో లక్షన్నర పాజిటివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రతో పాటు పోటీగా.. పాజిటివ్ కేసులు నమోదైన తమిళనాడులో ఇప్పటికి యాక్టివ్ కేసులు యాభై వేల దగ్గరే ఉన్నాయి. అక్కడ పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెరుగుతూ పోతోంది.
ఆంధ్రప్రదేశ్లో మరణాలు కూడా కంట్రోల్ కావడం లేదు. గత ఇరవై నాలుగు గంటల్లో అరవై ఎనిమిది మంది కరోనా కారణంగా చనిపోయారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది చనిపోయారు. కోవిడ్ వారియర్స్ కరోనా బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనంతపురం, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. విశాఖ, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలో తొమ్మిది వందలకుపైగా నమోదయ్యాయి. రోజువారీగా.. కేసులు పైపైకి వెళ్తున్నాయి.
ప్రస్తుతం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం.. అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అందరికీ వస్తుందనే భావనతో ఉన్న ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రయత్నాలు చేయడం లేదు. వేలకు వేలు నమోదవుతున్న కేసుల్లో వైద్యం అందించడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. నెలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోంది కానీ.. కేసులు ఇలా పెరుగుతూ ఉంటే… ఎంత ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదు. వైరస్ కారణంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోతున్న కుటుంబాలు.. దిక్కుతోచని స్థితికి వెళ్లిపోతున్నాయి.