ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ పాజిటివ్ కేసులు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 6045 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. డిశ్చార్జ్‌లు కూడా భారీగా పెరగడం.. ప్రభుత్వ యంత్రాంగానికి ఊరటనిస్తోంది. 6,494 మంది ఒక్క రోజులో డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో మరణాలు కూడా పెరిగాయి. ఇరవై నాలుగు గంటల్లో అరవై ఆరు మంది చనిపోయారు. ఇందులో పదిహేను మంది ఒక్క గుంటూరు జిల్లాలోనే చనిపోయారు. పాజిటివ్ కేసుల వేవ్ అన్ని జిల్లాల్లోనూ ఒకేలా కనిపిస్తోంది. విశాఖలో ఒక్క రోజులోనే వెయ్యి కేసులు దాటి నమోదయ్యాయి. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో 900కి కాస్త తక్కువగా నమోదయ్యాయి.
టెస్టుల సంఖ్యను ప్రభుత్వం అనూహ్యంగా పెంచింది. దాదాపుగా యాభై వేల టెస్టులు చేస్తున్నట్లుగా చెబుతోంది. ఇందులో ఇరవై వేల వరకు యాంటీజెన్ టెస్టులు ఉన్నాయి. కరోనా బారిన పడుతున్న వారిలో ప్రముఖులు కూడా ఎక్కువగానే ఉన్నారు. విజయసాయిరెడ్డికి ఆయన పీఏకు వైరస్ సోకగా.. తాజాగా.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన రెండు సార్లు పరీక్ష చేయించుకుంటే.. ఓ సారి పాజిటివ్‌గా.. మరో సారి నెగెటివ్‌గా వచ్చింది. చివరికి ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్‌గా వచ్చినట్లుగా తెలుస్తోంది.
అన్‌లాక్ ప్రారంభించిన తర్వాత ఏపీలో పరిస్థితులు కట్టుతప్పిపోయాయి. సామాజిక వ్యాప్తి జరుగుతుందనేంతగా.. కేసులు నమోదవుతున్నాయి. మెట్రో సిటీలు ఉన్న రాష్ట్రాల్లో నమోదయ్యే రేంజ్లో ప్రస్తుతం ఏపీలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం.. భవిష్యత్‌లో కరోనా రాని వారు ఎవరూ ఉండరంటూ… తేలికగా తీసుకుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.