కుంభమేళాలో మౌని అమావాస్య రోజున పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. వెంటనే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయింది. ఎక్కువ ప్రచారాలు జరగకుండా కట్టడి చేసింది. దృశ్యాలను కూడా పెద్దగా వెలుగులోకి రానివ్వలేదు. ఆ రోజు మొత్తం ఇతర చోట్ల యథావిధిగా పుణ్యస్నాలు జరిగేలా చేసి సద్దుమణిగేలా చేసింది. అదే రోజు సాయంత్రం ముఫ్పై మంది చనిపోయారని చెప్పి వారికి నష్టపరిహారం ఇస్తున్నట్లుగా చెప్పింది. కానీ ఆ రోజు తొక్కిసలాటలో ఏం జరిగిందన్నది పెద్ద మిస్టరీగా మారింది. మెల్లగా ఒక్కో విషయం బయటకు వస్తోంది.
కుంభమేళాలో జరిగింది చిన్నతొక్కిసలాట కాదని వందమందికిపైగానే చనిపోయారని తాజాగా రికార్డులు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ చనిపోయినవారిలో చాలా మందిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అక్కడి రికార్డుల ప్రకారం చనిపోయిన వారి సంఖ్య 90కిపైగానే ఉందని కొన్ని హిందీ వెబ్ మీడియా సంస్థలు రికార్డులు చూపించి ప్రశ్నిస్తున్నాయి. మరి కొన్ని మృతదేహాలను అలా నదిలో వదిలేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగే సూచనలు కనిపిస్తున్నాయి.
కుంభమేళాలో చిన్న ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఎక్కడో చోట .. మానవ తప్పిదం వల్ల తప్పు జరగవచ్చు కానీ… జరిగిన ప్రమాద తీవ్రతను దాచిపెట్టడం మాత్రం విమర్శలకు కారణం అవుతోంది. ఆ రోజున భక్తుల్లో పానిక్ రాకుండా ఎలాంటి తప్పుడు ప్రచారం.. జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడం వరకూ మంచిదే కానీ.. ఇలా చనిపోయిన వారిని తక్కువ చేసి ఆయా కుటుంబాలకు మనో వేదన కల్పించడమెందుకన్నది విమర్శలకు కారణం అవుతోంది. ఈ వివాదంపై యోగి సర్కార్ ఇంత వరకూ స్పందించలేదు.