అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాదు రాక ఏదో అసాధారణ చారిత్రిక ఘటనలాగా ప్రభుత్వాలు చేస్తున్న హడావుడి వెగటు పుట్టిస్తుంది. రాష్ట్ర హౌం మంత్రి నాయని నరసింహారెడ్డి స్వయంగా ఆమె ఎప్పుడు ఎలా వస్తుందో వెళ్తుందో తనకే తెలియదని ,అంతా అమెరికా వారే చూసుకుంటారని ప్రకటించేశారు. చాలా రోడ్లు ప్రాంతాలు వారి అజమాయిషీలోనే భద్రతా ఏర్పాట్టు చేస్తున్నాయి. బిక్షుకులను కూడా ముందస్తుగా అరెస్టులు చేశారు.మరీ దారుణం ఏమంటే వీధికుక్కల బెడద తగ్గించేందుకు వాటికి విష ప్రయోగం చేయడంపై జంతుహక్కుల రక్షణ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంత భద్రతతో వచ్చే అమెరికా అద్యక్ష పుత్రిక దరిదాపులకైనా ఆ కుక్కలు చేరే అవకాశముంటుందా? కాని బాగా భద్రత కల్పించారనే మెప్పుకోసం మనవాళ్లు ఇలాటి విపరీతాలకు పాల్పడుతున్నారన్నమాట. గతంలోనూ వాజ్పేయి హయాంలో బిల్ క్లింటన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కుమార్తెను తీసుకొచ్చారు. ఆమెతో పాటు విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ స్వయంగా తిరిగారు. ఆమె తనకుక్క పిల్లను తీసుకురాలేదని మీడియూ అదేపనిగా వాపోయింది. క్లింటన్ పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆయనతో కరచాలనంకోసం చేయి ముద్దు పెట్టుకోవడం కోసం ఎంపిలు ఎగబడ్డారు. మన రాష్ట్రపతిని రక్షణ మంత్రిని కూడా విమానాశ్రయంలో తనిఖీ చేయకుండా వదలని దేశం అది. అలాటి వారికి ఇక్కడ కూడా వారి హుకుంల ప్రకారమే భద్రతా ఏర్పాట్టు చేయొచ్చు.కాని అసలు ఆ తాళాలే వారికి అప్పగించడం అర్థరహితం. బహుశా రేపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇంతకన్నా తక్కువగా వ్యవహరించబోరు. భారత దేశం ఘనత గురించి అంతగా చెప్పే వారు కనీస ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోలేకపోవడం సిగ్గు చేటు.