తెలుగు సినిమా హీరోలందరిలోకి అత్యంత ఎక్కువగా భజన చేయించుకున్న హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ కొత్త రికార్డ్ సృష్టించేలా ఉన్నాడు. కాటమరాయుడు సినిమాకు ముందు కూడా పవన్ తరహా అలానే ఉండేది. కానీ కాటమరాయుడులో మాత్రం పీక్స్‌ని కూడా దాటేసింది. బండ్ల గణేష్ భజనకు అయితే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు పవన్. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ చేస్తున్న భజన దెబ్బకు త్రివిక్రమ్ సాహిత్యాన్ని ఇష్టపడే జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. త్రివిక్రమ్ ఎందుకు బండ్ల గణేష్‌లా మారుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన గురించి తానే చాలా గొప్పగా చెప్పుకున్నాడు. తాను చేసిన ఫక్తు మసాలా సినిమాలలో గొప్ప మెస్సేజ్ ఉందని చెప్పుకొచ్చాడు. అదికూడా గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషీ గురించి చెప్పాడు. ఆ చెప్పిన విధానం అయితే త్రివిక్రమ్ స్టైల్లో సాగింది. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో నాన్న గురించి చాలా గొప్పగా మాట్లాడాడు త్రివిక్రమ్. కానీ సినిమాలో మాత్రం అందులో పదిశాతం కూడా లేదు. తన సినిమాల్లో ఉన్న మెస్సేజ్‌ని కూడా అలాగే వెతికి మరీ చెప్పాడు పవన్. ఆ సినిమాలు చూసిన ఒక్కళ్ళకు కూడా ఆ మెస్సేజ్ కన్వే అయి ఉండదు అనడంలో డౌటే లేదు. అది కూడా ఓ నాలుగైదు సినిమాల లిస్ట్ చెప్పిన పవన్…గుడుంబా శంకర్‌లాంటి సినిమాల గురించి మాత్రం అస్సలు ప్రస్తావించలేదు. కేవలం కామెడీని, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని నమ్ముకుని సినిమాలు చేసే పవనే…ఆయన సినిమాలలో ఉన్న మెస్సేజ్ గురించి ఆ స్థాయిలో భజన చేసుకుంటే ఇక డైరెక్టర్ శంకర్, ఆర్. నారాయణమూర్తిలాంటి వాళ్ళు ఏ స్థాయి భజన చేసుకోవాలి.
సినిమాల గురించి పక్కనపెట్టి రాజకీయ భజన గురించి కొంచెం మాట్లాడుకుందాం. ప్రజల కోసం పుట్టిన చారిత్రక పురుషులు, దేవుళ్ళు…అన్నీ పవనే అని చెప్పి కాటమరాయుడు ప్రి రిలీజ్ ఫంక్షన్ జనాలకు చాటి చెప్పింది. భజన అదిరిపోయింది. మరి 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈ అన్ని సంవత్సరాల్లో ఆ ప్రజల కోసం చేసింది ఏంటి? ఒక్కసారి పవన్ పిలుపునిస్తే కోట్లాది మంది కదులుతారని త్రివిక్రమ్ చాలా గొప్పగా చెప్పాడు. మరి ప్రత్యేక హోదా కోసం పవన్ పిలుపుని అందుకుని ఎన్ని కోట్ల మంది ముందుకు వచ్చారే త్రివిక్రమ్‌కి తెలియదా? తెరవెనుక తతంగాలను కూడా లెక్కలోకి తీసుకుంటే దాదాపుగా దశాబ్ధం నుంచి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో ఉన్నట్టే లెక్క. మరి ఈ దశాబ్ధ కాలంలో అంతటి పరాక్రముడి వల్ల ప్రజలకు ఒరిగింది ఏంటి? తెలంగాణా ఉద్యమ సమయంలో ఎందుకు పిలుపుని ఇవ్వలేకపోయాడు? ఎవరికి భయపడి కలుగులో దాక్కున్నాడు ఈ భయం లేదని చెప్పుకునే పవర్ స్టార్? ఇక ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయగలిగాడు ఈ పవర్ స్టార్? పవన్ మాటను నమ్మి ప్రజలు చంద్రబాబుని గెలిపించారు అని పవన్ సన్నిహితులు చెప్తూ ఉంటారు. మరి ఆ చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, అవినీతిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుంటే ఎందుకు నిలదీయలేకపోతున్నాడు ఈ ‘కొత్తా దేవుడు’? డబ్బులంటే లెక్కలేదని చెప్తాడు. డమ్మీ ప్రొడ్యూసర్స్‌ని పెట్టి కోట్లాది రూపాయలను క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. నిర్లక్ష్యం అన్నపదానికి నా జీవితంలో చోటు లేదని చెప్తాడు. కానీ మిగతా హీరోలందరిలోతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే చాలా కేర్లెస్గా సినిమాలు చేసేస్తున్నాడా అని ఎవరికైనా అనిపిస్తుంది. బాహుబలి కోసం ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లాంటి హీరోల కష్టం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్ పైన కూడా ఆ కష్టం అందరికీ తెలుస్తుంది. కానీ పవన్ మాత్రం ఏదో కామెడీగా చేసేస్తూ ఉంటాడు. రాజకీయాలను కూడా పవన్ తీసుకున్నంత ఈజీగా తీసుకున్న నాయకుడు ఇంకొకరు ఎవరైనా తెలుగు నేలపై ఉన్నారా? 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నికలయ్యాక పూర్తిగా కనిపించకుండా పోయాడు. 2014లో రీ ఎంట్రీ ఇచ్చాడు. పార్టీ స్తాపిస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయాక రెండేళ్ళ వరకూ ఒకటి రెండు సార్లు కనిపించాడు. ఆ తర్వాత ప్రత్యేక హోదా పేరుతో కాసింత హడావిడి చేశాడు. మళ్ళీ ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. ప్రజల కోసం పోరాటం చేయడం, ప్రజల కోసం బ్రతకడం అంటే ఇదేనా పవన్?
ఫైనల్‌గా ఒక్కటి మాత్రం నిజం. భజన ఎలా చేయించుకోవాలి… ఏ స్థాయిలో చేయించుకోవాలి అనే విషయాన్ని మాత్రం మన నాయకులు, హీరోలు అందరూ కూడా పవన్ నుంచి నేర్చుకోవాలి. పవన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా…ఆయన చెప్పే సూక్తులను గుడ్డిగా నమ్మేవాళ్ళకు…ఆయన దేవుడు అని జరుగుతున్న ప్రచారాన్ని అంతే గుడ్డిగా విశ్వసిస్తున్నవాళ్ళకు…అలాగే పవన్ గురించి ఏమీ తెలియని వాళ్ళకు మాత్రం కాటమరాయుడు ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ చేయించుకున్న భజన పర్వం కనువిందుగా అనిపిస్తుంది. పవన్‌ని దేవుడనే నమ్మేస్తారు. కానీ పవన్ చుట్టూ ఉన్న మనుషులేంటి? 2009 నుంచి ప్రజల కోసం పవన్ చేసిన పోరాటం ఏంటి అనే ఆలోచన వస్తే మాత్రం….భజన బ్రహ్మాండంగా ఉంది పవన్…బరిలోకి ఎప్పుడు దిగుతావు అని ప్రశ్నించాలనిపిస్తుంది.