ఒంటరిపోరుతో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని.. విస్త్రతంగా ప్రచారం జరిగింది. అదే నిజం అయింది. మిత్రుల్లేకపోతే.. ఘోర పరాజయం కాయమని తేలిపోయింది. 1983లో టీడీపీ పొత్తుల్లేకుండా పోటీ చేయడం ఇదే ప్రథమం. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ.. ఇప్పటి వరకూ ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదు. 1983 నుంచి ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకుంటూనే ఉంది. ఈ కారణంగానే.. తొలిసారి పొత్తుల్లేకుండా పోటీ చేస్తున్నందున.. ఓడిపోతుందని అనుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిననప్పటి నుంచి ఇప్పటి వరకూ మిత్ర పక్షాలతో కలిసే బరిలోకి దిగింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర కోసం లేదా రాష్ట్ర, రాజకీయ అవసరాల కోసం టీడీపీ ప్రతిసారీ మిత్రులతో జత కట్టింది. రాష్ట్రంలో మిత్రపక్షాల ప్రభావం ఉన్నా.. లేకపోయినా గతంలో ఎక్కువసార్లు వాటితో కలిసే ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ.. ఘనవిజయం సాధించిన సందర్భాల్లో మిత్రపక్షాలూ లాభపడ్డాయి. ఆ పార్టీ ఓడిపోయినప్పుడు అవీ నష్టపోయాయి. 1983లో తొలిసారి పోటీ చేసినప్పుడు టీడీపీకి సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ మిత్రపక్షం. మేనకా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్న ఆ పార్టీకి ఎన్టీఆర్ 5 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా దేశమంతా ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి. ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీకి దేశం మొత్తం మీద రెండు సీట్లు లభిస్తే అందులో ఒకటి టీడీపీ కూటమి భాగస్వామిగా హన్మకొండ నుంచి దక్కింది. లోక్‌సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. 1989 ఎన్నికల్లో కూడా అదే కూటమి కొనసాగింది. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవడంతో ఇక్కడా ఆ పొత్తు కొనసాగింది. కానీ, రాష్ట్రంలో కూటమి ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది.
1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది. టీడీపీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసింది. కానీ, అందులో బీజేపీ లేదు. లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించింది. 1995లో టీడీపీ రెండుగా చీలిపోయి ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భావానికి చంద్రబాబు కృషి చేశారు. 1998లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. అదే సమయంలో కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 1999లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేశాయి. ఆ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యారు. 2004లో మరోసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చాయి. అప్పుడూ టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత బీజేపీకి టీడీపీ రాంరాం చెప్పింది. 2009లో అన్ని పక్షాలతో కూటమి నిర్మాణానికి టీడీపీ ప్రయత్నించింది. టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. కానీ నెగ్గలేకపోయాయి.
గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత… ఏపీకి కేంద్రం అండ ఉండాల్సిందేనన్న కారణంగా.. టీడీపీ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి ఆంధ్రలో గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ, నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న అభిప్రాయంతో నాలుగేళ్లకే ఆ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏపీలో ఒంటరిగా పోటీ చేసింది. దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీన్ని బట్టి చూస్తే.. ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి నష్టం తప్పదని తేలిపోయింది. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి లేకపోతే.. అప్పుడు కూడా ఓడిపోయి ఉండేదని చెబుతున్నారు.