ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల అస్త్రాన్ని కేసీఆర్ బయటకు తీశారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ల జీవో ఇస్తాం .. తర్వాత కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందో చూస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా జీవోనే కాబట్టి రేపోమాపో జారీ కావొచ్చు. కానీ ఇప్పుడు.. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఓవైసీ తెరపైకి తెచ్చారు. మరి ఎస్టీలకు ఇస్తే మా సంగతేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది నుంచి పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఓవైసీ ఇలా డిమాండ్ చేయడానికి కూడా కేసీఆరే కారణం. ఉద్యమ సమయంలో ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఎనిమిదేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన సమయంలో ముస్లిం వర్గాలకు చెందిన ‘బీసీ–ఈ’ గ్రూపు పైన అధ్యయనం చేయడానికి మాత్రమే సుధీర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. సుధీర్ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్ ముస్లిం మైనార్టీ వర్గాలకు 9శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసులు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం బీసీ–ఈ గ్రూపుకు రిజర్వేషన్లను 4శాతం నుండి 12శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అసెంబ్లీలో పెట్టిన బిల్లులో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారు. కానీ కేంద్రం అనుమతించలేదు. షెడ్యూల్ తెగల రిజర్వేషన్స్ సాంఘిక సంక్షేమ శాఖ పరిధికి సంబంధించినవి, ముస్లిం వర్గాల బీసీ–ఈ గ్రూపు రిజర్వేషన్స్ వెనుకబడిన తరగతుల శాఖకు సంబంధించినవి. అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉండటంతో తీర్మానం లెక్కలో లేకుండా పోయింది.
బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నప్పుడు కూడా కేసీఆర్ ఆ రిజర్వేషన్లను పెంచాలని ఒత్తిడి చేయలేదు. ఇప్పుడు బీజేపీతో చెడే వరకూ ఊరుకున్నారు. ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల తేనెతుట్టె కదిలిపారు. ఇప్పుడు ఓవైసీ కోరినట్లుగా ఆయన కోసమూ ఓ జీవో ఇస్తానంటే.. అది బీజేపీకి పెద్ద అస్త్రంగా మారుతుంది. ఇది కేసీఆర్కు ఇబ్బందికరమే.