లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. కొంపెల్ల మాధవీలత ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. నుదుట రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని కాస్త విచిత్రంగా ఉండే వేషధారణతో ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. విరించి హాస్పిటల్స్ ఎండీగా ఎక్కువ మంది గుర్తుంచుకుంటారు.
ఎన్నారై అయిన ఈమె పాతబస్తీ మూలాలు కలిగి ఉన్నారు. విరించి హాస్పిటల్స్ యజమానిగానే గాక మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో ‘క్యూ ఫండ్’ అనే ఫిన్‌కార్ప్‌నూ నడుపుతున్నారు. మాధవీలత ‘లోపాముద్రా ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పాతబస్తీ కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ కు లేదా.. మరో హిందూ ఫేస్‌కు చాన్సిచ్చేవారు. ఈ సారి రూటు మార్చారు.
దేశ వ్యాప్తంగా మోడీ ప్రభ వెలిగిపోతున్న ఈ సమయంలోనైనా ఒక్కసారి హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని ఆ పార్టీ అధిష్ఠానం గట్టి పట్టుదలగా ఉంది. బీఆర్ఎస్.. ఓటమి తర్వాత ఒవైసీ ప్రభావం ఎంతో కొంత తగ్గిందని, దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంని గట్టిగా ఢీ కొట్టే ప్రయత్నం చేస్తోందని, కనుక.. ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు గట్టిగా ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అభ్యర్థులుగా బరిలో నిలిస్తే.. ఈసారి ఇక్కడ భారీగా ముస్లింల ఓట్లలో చీలిక రావొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది.ఈ సమయంలో బలమైన, కొత్త ముఖాన్ని రంగంలోకి దించితే.. ఒవైసీ మీద గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తోంది. అందుకే మాధవీలత వైపు మొగ్గినట్లుగా కనిపిస్తోంది.