అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు కేసీఆర్తో సన్నిహితంగా ఉంటున్నారు. నిజానికి ఓవైసీలు ఎవరు అధికారంలో ఉంటే వారికి సన్నిహితులు. ఒక్క కిరణ్ మాత్రమే వారిని ఎంత దూరంలో ఉంచాలో అంతే ఉంచారు. ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న అతి చనువుతో ఓవైసీ తన పార్టీని తెలంగాణలో ఇతర చోట్లకు విస్తరించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ తనకు కంచుకోటలయిన పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ పెట్టేవారు. అక్కడ టీఆర్ఎస్ హిందూ ఓట్లను చీల్చే అభ్యర్థిని పెట్టి ఓవైసీకి సాయం చేసేది. మిగతా చోట్ల ముస్లింలకు.. టీఆర్ఎస్కు మద్దతివ్వాలన్న సంకేతాలు పంపేది.
అయితే తన మద్దతుతో కేసీఆర్ ఎక్కువ లాభపడుతున్నారనుకున్నారో లేకపోతే.. ఇదే అదనుగా పార్టీని విస్తరించాలనుకుంటున్నారో కానీ ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ అవతల నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎంఐఎంకు ఓటు బ్యాంక్ ఉంది. నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో ముస్లింల ఓటు బ్యాంక్ గణనీయంగా ఉంది. బోధన్ నుంచి ఎప్పుడూ ముస్లిం అభ్యర్థికే సీటిస్తారు. అందుకే ఈ రెండు చోట్ల ఎంఐఎం ప ోటీ చేయనుంది. నిజామాబాద్ అర్బన్ నుంచి 2014 ఎన్నికల్లో ఎంఐఎం క్యాండిడేట్ ఎలాంటి ప్రచారం చేయకుండానే రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టారు. 2018లో టీఆర్ఎస్తో అవగాహన కారణంగా పోటీ చేయలేదు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సునాయాసం అయింది.
పాతబస్తీ బయట పోటీ చేసే విషయంలో ఓవైసీ హిందూ అభ్యర్థులకు చాన్సిస్తూ ఉంటారు. నిజామాబాద్ అర్బన్ నుంచి మున్నూరు కాపు సామాజికవర్గానికి ఎంఐఎం తరఫున అభ్యర్థిని బరిలో దింపాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ కూడా పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై కన్నేసింది. ఇలా మజ్లిస్ బలం పెంచుకుంటే ఎక్కువగా నష్టపోయేది టీఆర్ఎస్సే. మరి కేసీఆర్ ఓవైసీ మనసు మార్చగలరా ?