పౌరసత్వ సవరణ చట్టానికి.. మరో మాట లేకుండా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో.. మద్దతు పలికారు. వైసీపీ ఎంపీలంతా.. బీజేపీ చట్టానికి మద్దతుగా ఓటేశారు. ఇది ఆయనపై.. ముస్లిం వర్గాల్లో కొత్త అనుమానాలకు కారణం అయింది. రాజధాని ఆందోళనల్లో.. ఏపీ ముస్లింవర్గాల ఆక్రోశం పెద్దగా ఎవరికీ వినిపించడం లేదు కానీ… వారి జనాభా అధికంగా ఉన్న ప్రతీ చోటా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా వారు..ఏపీ సర్కార్‌నే.. వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు… మరో వైపు నుంచి ఈ డిమాండ్ వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత ఆత్మీయ మిత్రుడని ప్రకటించుకున్న.. అసదుద్దీన్ ఓవైసీ.. పౌరసత్వ చట్టానికి జగన్ ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పౌరసత్వ చట్టంపై.. తాడో పేడో అన్నట్లుగా పోరాడాలని… ముస్లింలకు.. ఓవైసీ పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ.. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రకటనలు చేయడాన్ని స్వాగతిస్తున్నారు. అయితే.. ఆయనకు అత్యంత ఆత్మీయులుగా ప్రకటించుకోబడిన.. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మాత్రం నోరు తెరవడం లేదు. కనీసం కేసీఆర్ స్వయంగా వ్యతిరేకించకపోయినా.. ఆయన పార్టీ పరంగా వ్యతిరేకతను పార్లమెంట్లో తెలిపారు. దాంతో.. కేసీఆర్ విషయంలో ఓవైసీకి అభ్యంతరాలు లేవు. కానీ జగన్ మాత్రం పార్లమెంట్లో మద్దతు తెలుపడమే కాదు.. నోరెత్తి.. కేంద్రాన్ని ఆ చట్టంపై.. ఒక్క ప్రశ్న కూడా ప్రశ్నించడం లేదు.
ఇప్పటికి దేశంలో పది మంది ముఖ్యమంత్రులు.. తాము ఆ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ప్రకటనే చేయాలని ఓ వైసీపీ కోరుకుంటున్నారు. పౌరసత్వ చట్టాన్ని తాము అమలు చేయబోమని ప్రకటిస్తే… కేంద్రం వెనక్కి తగ్గతందని వైసీపీ భావిస్తున్నారు. మెజార్టీ సీఎంలు వ్యతిరేకిస్తే.. కేంద్రం కూడా వెనక్కి తగ్గక తప్పదు. ఎందుకంటే.. కేంద్రం చట్టాలు చేసినా… ఆయా పౌరులు నివసించాల్సింది రాష్ట్రాల్లోనే. అందుకే ఓ ఓవైసీ.. జగన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. జగన్ కష్టాలు జగన్‌వి.. ఓవైసీకి మాత్రం తెలియవా..?