హైదరాబాద్ స్టేట్‌ను దేశంలో విలీనం చేసిన సెప్టెంబర్ 17ను విమోచన దినంగా పాటిస్తే మజ్లిస్‌కు కోపం వస్తుందని.. ముస్లింలు ఒప్పుకోరని అందుకే రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారంలో ఉండే పార్టీలు చేయవన్న ఓ నమ్మకం ఇప్పటి వరకూ ఉంది. దీని మీదనే బీజేపీ రాజకీయం చేస్తూ వస్తోంది. టీఆర్ఎస్ ఎలాగూ చేయడంలేదని.. కేంద్రం తరపున తామే అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఈ సమయంలో మజ్లిస్ అధినేత ఓవైసీ ట్విస్ట్ ఇచ్చారు. తాము కానీ ముస్లింలు కానీ విమోచనా దినానికి వ్యతిరేకం కాదని.. స్వయంగా ఆ రోజున పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహిస్తామని హాజరు కావాలని అమిత్ షాకు లేఖ రాశారు. కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు.
సెప్టెంబర్ 17ను ఎంఐఎం ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం తుర్రేబాజ్ ఖాన్, మగ్ధూం మోహిద్దీన్ వీరోచిత పోరాటం చేశారని..వారి సేవలను మరిచిపోవద్దన్నారు. సెప్టెంబరు 17ను పురస్కరించుకుని పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెలంతా పాల్గొంటారని తెలిపారు. సెప్టెంబరు 17న పాతబస్తీలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని…ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
హైదరాబాద్ స్టేట్‌ను దేశంలో విలీనం చేసిన సెప్టెంబర్ 17 తెలంగాణలో ఓ రాజకీయ అంశం. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా .. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు విలీన దినోత్సవాన్ని నిర్వహించలేదు. ఆ రోజున విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలనుకునే పార్టీల కార్యకర్తలు…పోలీసుల వలయాన్ని ఛేదించుకుని వెళ్లి ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా ఎగురవేయడం ఓ సాహసకార్యం. టీఆర్ఎస్ కూడా ఉద్యమ సమయంలో అలాగే చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నిస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు బీజేపీ దెబ్బకు చేయక తప్పడంలేదు. ఈ రాజకీయానికి ఓవైసీ లేఖతో ట్విస్ట్ వచ్చినట్లయింది.
ఈ విమోచనను ఎవరూ వ్యతిరేకించకపోతే అసలు రాజకీయానికే చాన్స్ లేదు. మరి మజ్లిస్ ఇచ్చిన ట్విస్ట్‌తో బీజేపీ, టీఆర్ఎస్ ఏం చేస్తాయో మరి !