తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. నిజానికి పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏం చేసినా సస్పెండ్ చేయకుండా పదవి కాలం అయిపోయే వరకూ అలా భరిస్తూ ఉంటారు. కానీ మల్లన్న విషయంలో మాత్రం వేగంగా నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణం ఉంది. ఆయన కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ పై బీసీ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అసలు కులగణన చేసి బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకుంటే తిరుగుండదని కాంగ్రెస్ అనుకుంటూ ఉంటే.. కాంగ్రెస్ పార్టీతో పదవి పొంది కాంగ్రెస్ ప్లాన్ ను దెబ్బకొట్టేలా వ్యవహరిస్తున్నారు.
ఈ ఒక్క విషయంలోనే కాదు గ్రూప్ వన్ పరీక్షలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి విషయాల్లోనూ ఆయన పార్టీ లైన్ కు భిన్నంగా వెళ్లారు. నిజం చెప్పాలంటే పార్టీ ఏ లైన్ తీసుకుంటే దానికి భిన్నంగా వెళ్తున్నారు. ఆయనను వదిలించుకోకపోతే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనే ట్యాగ్ పెట్టుకుని చాలా చేటు చేస్తారని ఫీలయి వెంటనే వేటు వేశారు. ఇప్పటి వరకూ ఆయన ప్రవర్తన ..రాజకీయ పార్టీల్లో ఉన్న విధానం చూస్తే ఆయన ఇక ఏ పార్టీలోనూ మనుగడ సాగించలేరు.
టీడీపీలో చేరుతారని..బీజేపీ అని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మల్లన్న బీసీ నినాదం తీసుకున్నారు. టీడీపీకి బీసీ ఇమేజ్ ఉంది. చేరితే బాగానే ఉంటుంది.. కానీ ఆయనను తట్టుకోవడం టీడీపీ నేతలకు అంత తేలిక కాదు. అదే సమయంలో ఆయన బీజేపీలో చేరి బయటకు వచ్చారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సొంత పార్టీ పెట్టుకోవడమే మంచి చాయిస్ అనుకోవచ్చు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీచేసి.. కోదండరాం ను కూడా దాటేసి..రెండో స్థానంలో నిలిచారు. బీసీ వర్గాల్లో పట్టు కోసం ఆయన పర్యటనలు చేస్తున్నారు. అందుకే సొంత పార్టీ పెట్టుకుంటే.. శక్తి మేర సీఎం అయ్యేందుకు ప్రయత్నించవచ్చని అదే బెస్ట్ చాయిస్ అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.