కరోనా వైరస్ భారతదేశాన్ని వణికిస్తోంది. కాస్తో కూస్తో వైద్య రంగం పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాలు కొంత వరకు పరిస్థితిని తట్టుకోగలుగుతూ ఉంటే అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ సరిగ్గా లేని రాష్ట్రాలు విలయ తాండవం చూస్తున్నాయి. తాజాగా తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎంత కల్లోలంగా ఉంది అన్న దానికి అద్దం పడుతుంది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి రుయా ఆసుపత్రిలో కోవిడ్ వార్డు అత్యవసర విభాగం లో ఆక్సిజన్ నిలిచిపోయింది. దీని వల్ల దాదాపు 10 మంది దాకా మృతి చెందగా మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడం పై రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. సిబ్బంది నుండి ఎటువంటి సమాధానం రాక పోవడం, ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో రోగుల బంధువులు ఐసియు వార్డు లోకి వెళ్లి సామాగ్రిని ధ్వంసం చేయడం ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో నర్సులు భయపడి వార్డు నుండి పారిపోయారు. వైద్యులు నర్సులు అక్కడి నుండి వెళ్లి పోవడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చనిపోయిన వారిలో పట్టుమని 30 ఏళ్ళు కూడా నిండని, ఇతరత్ర ఎటువంటి ఆరోగ్య సమస్య లేని యువకులు కూడా ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి కావాల్సిన పేషెంట్స్ కూడా కేవలం ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడం వల్ల మృత్యువు ఒడి లోకి చేరుకోవాల్సి వచ్చింది. ఆందోళన పెరిగి పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. పోలీసులు రుయా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం, పరిస్థితిని చక్కబెట్టడం కంటే, పరిస్థితి రాష్ట్రంలో బాగాలేదు అని వ్యాఖ్యలు చేసే వారిపై రాజకీయ కక్ష సాధింపు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.