తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుతోంది. కరోనా తగ్గుతున్నా లేకపోయినా.. ఆక్సిజన్ మరణాలు మాత్రం ఎక్కడా నమోదు కావడం లేదు. నాలుగైదు రోజుల కిందటి వరకూ… ఆ ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోయిందంటే.. ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోయిందని … పరుగులు పెట్టేవారు. యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించేవారు. ఇప్పుడు డిమాండ్ సగానికిపైగా తగ్గింది. సప్లయ్.. డబుల్ అయింది. 10 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో బెడ్లు, ఆక్సిజన్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. కానీ వారం రోజుల నుంచి ఆ డిమాండ్ కనిపించడంలేదు. హోటళ్లు, ఇతర ఏసీ హాల్స్ ను తీసుకుని క్వారంటైన్ సెంటర్లు, తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసినవారు ప్రస్తుతం వాటిని మూసివేస్తున్నారు.
క్వారంటైన్ సెంటర్లు కూడా మూసివేయటం ప్రారంభించారు. జూన్ 10వ తేదీ నాటికి తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుదంని అంచనా వేస్తున్నారు. కర్ఫ్యూ, లాక్ డౌన్ నిబంధనలు మరో వారం, పది రోజులు పొడిగిస్తారని అంచనా వేస్తున్నారు. పూర్తిగా కట్టడి చేసే వరకూ ఆంక్షలుండాలని … ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆక్సిజన్ విషయంలో ప్రభుత్వాలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నాయి. పెద్ద ఎత్తున విదేశాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్లు.. ఇతరులను పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున బడా బడా కాంట్రాక్టులు పొందిన సంస్థలు కొంత ఆక్సిజన్ సంబంధిత పరికాలు తెప్పించడంలో సాయం చేశాయి.
చిరంజీవి లాంటి వారు ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. సోనూసూద్ లాంటి వారు నేరుగా ప్లాంట్లనే ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోఆక్సిజన్ సప్లయ్ మెరుగుపడింది. అదేసమయంలో డిమాండ్ తగ్గింది. మూడో వేవ్ ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపధ్యంలో ఇప్పటి ఆక్సిజన్ మౌలిక సదుపాయాలు… ముందు ముందు ఎంతో ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నాయి.