కడప జిల్లా పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఇద్దరు కోవిడ్ పేషెంట్స్ రాత్రి మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో ఇదే ఆస్పత్రిలో ఉన్న మరో 70 మంది పేషెంట్స్ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. సీఎం సొంత జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న ఈ పరిస్థితికి, ఆక్సిజన్ సిలిండర్ లను అక్రమంగా డైవర్ట్ చేయడమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఇటీవల కోవిడ్ ఆసుపత్రి గా మార్చారు. ఇందులో దాదాపు 70 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది ఆక్సిజన్ పైనే ఆధారపడి ఉన్నారు. అయితే నిన్న మధ్యాహ్నం ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు అయిపోయాయి. అప్పటికే రావలసిన కొత్త ఆక్సిజన్ సిలిండర్లు రాలేదు. ఆస్పత్రి సిబ్బంది పై అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే సిలిండర్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపవలసిన ఆక్సిజన్ సిలిండర్లను వేరే కారణాల వల్ల మరొక చోటికి తరలించమే ఈ పరిస్థితికి కారణం అని అని నోడల్ అధికారులు చెబుతున్నారు. మధ్యరాత్రి సమయంలో నారాయణ ,రామలక్ష్మి అన్న ఇద్దరు పేషెంట్స్ ఆక్సిజన్ అందక మృతి చెందారు. వీరి మృతికి ఆక్సిజన్ అందక పోవడమే కారణం అని అధికారులు కూడా ధ్రువీకరించారు. వారు మృతి చెందిన సమయం లో ఆస్పత్రిలో కరెంట్ కూడా లేకపోవడం గమనార్హం.
ఏదిఏమైనా సీఎం సొంత జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రికి రావలసిన ఆక్సిజన్ సిలిండర్స్ కూడా డైవర్ట్ అయిపోయి వేరే చోటికి వెళుతూ ఉండడం, తద్వారా ప్రభుత్వాసుపత్రిలో ని రోగులు మృతి చెందుతూ ఉండటం విమర్శలకు దారి తీస్తోంది.