సరిహద్దుల్లో యుద్ధాలకే కాదు.. అంతర్గత విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి కూడా.. తాము ఉపయోగపడతామని యుద్ధవిమానాలు నిరూపిస్తున్నాయి. ఆక్సీజన్ ట్యాంకర్ల అత్యవసర రవాణాకు.. యుద్ధ విమానాలను తెలంగాణ సర్కార్ వినియోగించుకుంటోంది. తెలంగాణలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండటంతో విపత్కర పరిస్థితులు ఏర్పడక ముందే.. నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సరఫరా ఆలస్యం అవుతోంది. తెలంగాణకు భువనేశ్వర్ నుంచి ఆక్సిజన్ర రావాల్సి ఉంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా అయితే రెండు, మూడు రోజులు పడుతుంది. ఈకారణంగా యుద్ధ విమానాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
ఖాళీ ట్యాంకర్లను యుద్ధ విమానాల్లో ఎక్కించి.. భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు తరలించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి యుద్ధ విమానాలు ఖాళీ అక్సిజన్ ట్యాంకర్లతో గాల్లోకి ఎగిరాయి. మొత్తం 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను తీసుకుని వస్తారు. 8 ఖాళీ ట్యాంకులను విమానాల్లో తీసుకెళ్లారు. ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు యుద్ధ విమానాలను తొలి సారిగా తెలంగాణ సర్కార్ ఉపయోగించుకుంటోంది. ప్రస్తుతం.. కరోనాతో యుద్ధమే చేస్తున్నారు. ఈ యుద్ధంపై పోరాటానికి నిజంగా యుద్ధ విమానాలనే ఉపయోగించడం.. అందర్నీ ఆకర్షిస్తోంది.
దేశంలో ఇప్పుడు ఆక్సిజన్ టెర్రర్ నడుస్తోంది. దేశ రాజధానిసహా.. అనేక చోట్ల ఆక్సిజన్ లేక.. పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని పరిస్థితినిచక్క దిద్దే ప్రయత్నం చేస్తున్నా.. పెద్దగా ఫలితం ఉండటం లేదు. పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ పంపిణీ నిలిపివేసి.. పూర్తి స్థాయిలో వైద్య అవసరాలకే వినియోగిస్తున్నారు. అయినా సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని అధిగమించడానికి యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నారు.