రి.. రిలీజ్ ట్రెండ్ ఇది. సమయం, సందర్భం కుదరాలే కానీ, పాత సినిమాల్ని మళ్లీ ఓసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి వసూళ్లు రాబట్టుకోవొచ్చు. అయితే నిన్నా మొన్నటి వరకూ హిట్ సినిమాలకే ఈ ఫార్ములా వర్కవుట్ అయ్యేది. బడా హీరోల సినిమాలకే డబ్బులు వచ్చేవి. అయితే ఇప్పుడు ఫ్లాప్ సినిమాలూ, రిరిలీజ్ లో వసూళ్లు దక్కించుకొంటున్నాయి. మీడియం రేంజ్ హీరోల సినిమాలకూ ఇలానే సునామీ వసూళ్లు దక్కుతున్నాయి.
మొన్నటికి మొన్న ‘ఆరేంజ్’ని రీ రిలీజ్ చేస్తే ఏకంగా రూ.1 కోటికిపైనే వసూళ్లు వచ్చాయి. ‘సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలా చూస్తే నాకు అప్పుల బాధ తప్పేది’ అని నాగబాబు వాపోయారు. ఇప్పుడు ‘ఓయ్’ సినిమాకీ ఇలాంటి స్పందనే దక్కింది. సిద్దార్థ్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్. అయితే ప్రేమికుల రోజుల రీ రిలీజ్ చేశారు. ఎన్ని థియేటర్లలో ఈ బొమ్మ వేస్తే, అన్ని థియేటర్లలోనూ హౌస్ ఫుల్స్ తో నడిచింది. దాంతో రెండో రోజు కూడా షోలు కొనసాగించారు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఫస్ట్ రన్ లో ఫ్లాప్. ఇప్పుడు ‘యాత్ర 2’కి పోటీగా వేస్తే… వసూళ్లు గుమ్మరించారు. ఫ్లాప్ అయిన సినిమాల్ని కాస్త పబ్లిసిటీ చేసుకొని, మంచి టైమ్ చూసుకొని రీ రిలీజ్ చేస్తే, మంచి వసూళ్లు దక్కించుకోవొచ్చన్న నమ్మకాన్ని ‘ఓయ్’ లాంటి సినిమాలు ఇస్తున్నాయి. థియేటర్లో ఫ్లాప్ అయి, ఇప్పటికే పదుల సార్లు టీవీలో వచ్చేసిన సినిమాకు సైతం రీ రిలీజుల్లో కోట్లు వస్తున్నాయంటే… ప్రేక్షకుల మూడ్ ఏంటో అస్సలు అర్థం కావడం లేదు.