అమరావతిపై విషం కక్కి ఫలితం అనుభవిస్తున్నా వైసీపీ ధోరణి మార్చుకోవడం లేదు. అమరావతి నిర్మాణం జరిగితే తమ గత ఐదేళ్ల చరిత్ర కూడా రికార్డ్ అవుతుందనే ఆందోళనో ఏమో, అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం నిర్విరామంగా చేస్తోంది. ఓ వైపు అమరావతికి ఓ రూపు తీసుకురావాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే..రాజధాని నిర్మాణం అడ్డుకోవడమే ధ్యేయంగా కుట్రలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రపంచ అగ్రశ్రేణి నగరాలతో సమానంగా అమరావతిని నిర్మించాలనే ఎజెండాతో చంద్రబాబు ఉన్నారు. మూడేళ్లలో అమరావతికి ఓ రూపు తీసుకురావాలని టార్గెట్ తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అమరావతిని నవ నగరాలు కాన్సెప్ట్ తో డెవలప్ చేస్తున్నారు. రాజధాని డెవలప్ కోసం మరిన్ని భూములు సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంటే.. వైసీపీ తన సహజ స్వభావాన్ని మానుకోవడం లేదు. సోషల్ మీడియాలో మళ్లీ విషం కక్కుతోంది.
రైతుల్లో అనుమానాలను లేవనెత్తి అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేలా కుట్రలు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంత రైతులు వైసీపీ హయాంలో నిర్విరామంగా దీక్షలు చేశారు. రైతులను బెదిరించారు. డబ్బును ఆఫర్ చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గకుండా పోరాటం చేసిన తీరు చంద్రబాబును సైతం కదిలించింది. అందుకే రాజధాని విషయంలో చంద్రబాబూ అంతే పట్టుదలగా ఉన్నారు.
అయితే, భూముల విషయంలో రైతుల్లో లేని అపోహలను సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. వీటిపై తాజాగా స్పందించారు మంత్రి నారాయణ. అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని , రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల భూముల ధర నిలవాలన్న, పెరగాలన్న స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్ని చేస్తామని , ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.