రేటింగ్: 2/5
`ఈ సినిమా ఆడకపోతే.. నా పేరు మార్చుకుంటా“
అంటాడు హీరో.
“ఈ సినిమాతో.. ఈ హీరోకి తన కెరీర్లోనే సూపర్ హిట్ ఇచ్చేస్తున్నా“
అన్నాడు దర్శకుడు.
`పాగల్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినిపించిన స్టేట్మెంట్లు ఇవి.
వాళ్ల కాన్ఫిడెన్స్ లెవల్స్ చూసి ముచ్చటపడిపోవాల్సిందే. కానీ విషయం ఏమిటంటే… మాట్లాడాల్సింది.. జనాలు. సినిమా. అంతే. బొమ్మ పడక ముందు ఎవరేం చెప్పినా అది ఓవర్ కాన్ఫిడెన్సే. `షో` పడ్డాకే.. విషయం తెలుస్తుంది. మరి `పాగల్` పరిస్థితేంటి? విశ్వక్ సేన్ ది ఓవర్ కాన్ఫిడెన్సా..? ఓన్లీ కాన్ఫిడెన్సా?
ట్రైలర్ లోనే కథంతా చెప్పేశారు. అయినా టూకీగా చెప్పాలనుకుంటే, ప్రేమ్ (విశ్వక్ సేన్) సార్థక నామధేయుడు. తనని `అమ్మ`లా ప్రేమించే అమ్మాయి కోసం అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో కనిపించిన ప్రతీ అమ్మాయికీ (ఓసారి మగాడికి కూడా) ఐ లవ్ యూ చెబుతాడు. ప్రేమ్ కి సీరియల్ పిచ్చి ఉందని ఓ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. మరో అమ్మాయి.. ప్రేమ్‌ని తన అవసరాలకు వాడుకుని వదిలేస్తుంది. ఆఖరికి ఓ బండమ్మాయిని చూసుకుని, గీతాంజలి సినిమా టైపులో అరచి మరీ ప్రేమిస్తే `నాకు పెళ్లి కుదిరిపోయింది.. పో` అని హ్యాండిస్తుంది. ఈ క్రమంలోనే రాజిరెడ్డి (మురళీ శర్మ) తగులుతాడు. ఆఖరికి తనని కూడా ప్రేమిస్తాడు. మరి ఇన్ని ప్రేమల మధ్య తీర (నివేదా పేతురాజ్) ప్రేమ కథేంటి? ప్రేమ్.. ప్రేమ తీరాన్ని తాకిందా, లేదా? అన్నది మిగిలిన కథ.
అమ్మలా ప్రేమించే అమ్మాయిని అన్వేషించడం అనే పాయింట్ – ఈ రొటీన్ రొడ్డ కొట్టుడు ప్రేమకథకు కాస్త ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది. తొలి సన్నివేశాల్లో అమ్మ ప్రేమని గుప్పించిన దర్శకుడు.. ఆ తరవాత.. అమ్మాయి ప్రేమ(ల్ని) పరిచయం చేస్తూ వెళ్లాడు. ప్రేమ్.. అమ్మాయిని ప్రేమించడం, వాళ్లు ఏదో ఓ వంకతో రిజెక్ట్ చేయడం. తొలి సగం వరకూ ఇదే తంతు. ఫస్టాఫ్ లో నాలుగు ప్రేమకథలు (మురళీ శర్మతో కలుపుకుని) చూపించాడు దర్శకుడు. ఒక్కో ప్రేమకథనీ.. ఒక్కో తరహాలో ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తే బాగుండేది. కథలో ఎలాగూ కొత్తదనం లేదు కాబట్టి, ఆ ఎపిసోడ్లలో అయినా దాన్ని చూపించాల్సింది. బండమ్మాయి మహాలక్ష్మిని ప్రేమించడంలోనే కాస్త ఫన్ పండింది. ఓ లావుపాటి అమ్మాయి.. ప్రేమ్ ని రిజెక్ట్ చేయడంలో ఓ రకం ఫన్ ఉంది. అది థియేటర్లలో బాగానే పండింది. `ఎవర్రా నా లవర్ ని ఏడిపించింది` అంటూ హీరో వెళ్లడం.. అక్కడ ఓ గ్యాంగ్ ని మాటిమాటికీ చితక్కొట్టి రావడం, చివర్లో ఓ భారీ డైలాగ్ చెప్పడం – ఇలాంటి ఎపిసోడ్లు థియేటర్లలో బాగానే పండాయి. కానీ.. అక్కడక్కడ మెరుపులు సరిపోవు. సినిమా అంటే… రెండు గంటల పాటు ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టాలి. ఆ దమ్ము ఈ కథకు లేకుండా పోయింది.
ఈ సినిమాలోని హీరోయిన్ ఫస్టాఫ్ లో కనిపించదు. సెకండాఫ్ లోనే ఎంట్రీ ఇస్తుంది. సగం సినిమా మొత్తం హీరోయిన్ ని చూపించకుండా `ఇది లవ్ స్టోరీ` అనడం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. `ఆర్నెళ్లు నీకు ప్రేమ జ్ఞాపకాలు ఇస్తా` అని చెప్పడం కూడా… అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ ఆర్నెళ్ల ప్రేమ కథ.. మరింత రొటీన్ గా సాగడంతో ప్రేక్షకులకు `ఈ ఆర్నెళ్లూ త్వరగా అయిపోతే బాగుణ్ణు` అన్న ఫీలింగ్ వస్తుంది. తీర… ప్రేమలో ఎమోషన్ ఉంది. కానీ అది బలవంతంగా ఇరికించిందే. డెప్త్ ఉంది. కానీ అది కావాలని తవ్విందే. ప్రేమకథలో ఆటోమెటిగ్గా ఎమోషన్, డెప్త్, కాన్ఫ్లిట్ వచ్చేయాలి. క్రియేట్ చేయకూడదు. అవన్నీ రెడీమెడ్గా దట్టిస్తే.. ప్రేమకథ చప్పబడిపోతుంది. `పాగల్` లోపం అదే.
`మీ అమ్మాయిని ఎంత ప్రేమించానో మీకు తెలియాలనే.. మిమ్మల్ని ప్రేమించా` అని ఓ అబ్బాయి.. కాబోయే మామగారిని అనడం ఏమిటో… అదేం లాజిక్కో అర్థం కాదు. అప్పటి వరకూ `గే` లవర్ స్టోరీ.. ఈ రకంగా `గే`రు మారుస్తుందని ఎవరూ ఊహించరు కూడా. ఆ వ్యవహారం కాస్త తేడా కొట్టినట్టే అనిపిస్తుంది. మధ్యమధ్యలో మంచి పాటలు, ఆర్.ఆర్.. ఇవన్నీ సినిమాకి ఊపు తీసుకొచ్చాయి గానీ, లేదంటే.. ఈ కథెప్పుడో గురకెట్టి బొజ్జునేది.
విశ్వక్ సేన్ ట్రెండీగా ఉన్నాడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీని బాగానే హ్యాండిల్ చేయగలడు అన్న నమ్మకం కల్పించాడు. తనది సహజమైన ఎక్స్ప్రెషన్. అయితే ఈ సినిమాలో కొన్ని సార్లు.. అది డ్రమటిక్ గా కనిపించింది. అదొక్కటే లోపం. మిగిలినదంతా ఓకే. నివేదా తొలిసగం ఒక్క ఫ్రేమ్‌లోనూ కనిపించదు. సెకండాఫ్‌లో తన పార్టే ఎక్కువ. అయితే… చిన్మయి గొంతు నివేదాకి యాప్ట్ కాలేదనిపిస్తుంది. భూమికది అతిథి పాత్ర. మురళీశర్మ ఇలాంటి పాత్రలు ఇది వరకు చాలా చాలా అంటే చాలా కంటే చాలా ఎక్కువగా చేసేశాడు.
పాటలు, బీజియమ్స్, కెమెరావర్క్.. ఇవన్నీ ఓ రొటీన్ కథని లేపడానికి.. క్రేన్లా చాలా కష్టపడ్డాయి. `అమ్మా నాన్న లేనివాళ్లు అనాథలు కారు. ప్రేమించే వాళ్లు లేనివాళ్లే అనాథలు`
`మనిషిని పుట్టించింది దేవుడే. చంపేది దేవుడే. చంపేశాడని దేవుడు రాక్షసుడైపోడు` లాంటి ఫేస్ బుక్ కొటేషన్లు కొన్ని డైలాగులుగా వినిపిస్తాయి. దర్శకుడికి ఇది తొలి ప్రయత్నం. ఏం చెప్పి విశ్వక్ ని ఒప్పించాడో గానీ, అది తెరపై తీసుకురావడంలో తడబడ్డాడు. తొలి సగంలో చూపించిన ప్రేమకథల్లో ఫ్రెష్ నెస్ లేకపోవడం, ద్వితీయార్థంలో వచ్చే ప్రేమకథలో ఎమోషన్ మిస్ అవ్వడం పాగల్ కి శాపాలుగా మారాయి.
ఫినిషింగ్ టచ్: పాగల్ హో `గయా`
రేటింగ్: 2/5