కొన్ని కథలు చెప్పడానికి, వినడానికి బాగుంటాయి. తప్పకుండా చెప్పాల్సిన కథలంటూ కొన్నుంటాయి. అయితే.. అవన్నీ సినిమాలకు పనికి రాకపోవొచ్చు. దర్శకులకు తమ అభిరుచిని చాటుకోవడానికో, సమాజాన్ని వెండి తెరపై ప్రతిబింబించడానికో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. అలాంటి చోట.. ఓటీటీ వాళ్లకో గొప్ప వేదిక అవుతూ వస్తోంది. ఇది వరకు.. చిన్న చిన్న కథల్ని షార్ట్ ఫిల్మ్స్‌గా తీసుకునేవాళ్లు. ఇప్పుడు అలాంటి కొన్ని కథల్ని గుది గుచ్చి – విడుదల చేయడానికి ఓటీటీలు ఆస్కారం కల్పిస్తున్నాయి. బాలీవుడ్ లో `దస్ కహానియా` అలాంటి ప్రయత్నమే. ఈమధ్య తెలుగులో `మెట్రో కథలు` చూశాం. `పావ కథైగల్` కూడా ఇలాంటి కథల సమాహారమే. నాలుగు కథలు, భిన్న నేపథ్యాలు, నలుగురు దర్శకులు చేసిన ప్రయత్నం ‘పావ కథైగల్’. తమిళంలో రూపొందించిన ఈ సినిమాలాంటి కథల సమాహారం… తెలుగులోనూ చూసే అవకాశం వుంది. మరి.. ఈ నాలుగు కథలూ దేన్ని చర్చించాయి? వాటిలో ఉన్న సారమెంత?
* తంగమ్ (నా బంగారం)
సుధా కొంగర దర్శకత్వం వహించిన కథ ఇది. ఓ గే చేసిన త్యాగం… నా బంగారం. సత్తారు (కాళిదాస్ జయరాం) అబ్బాయే అయినా, అమ్మాయిలా ప్రవర్తిస్తుంటాడు. తన వాలకం చూసి.. ఇంట్లోవాళ్లూ, ఊర్లో వాళ్లూ తనని దూరం పెడతారు. బొంబాయి వెళ్లి ఆపరేషన్ చేయించుకుని, అమ్మాయిలా మారిపోవాలన్నది తన కల. అందుకోసం పైసా పైసా కూడబెడతాడు. తన స్నేహితుడు శరవణ అంటే.. సత్తారుకి చాలా ఇష్టం. తనని ప్రేమిస్తాడు. కానీ శరవణ మాత్రం సత్తారు చెల్లెల్ని ప్రేమిస్తాడు. వాళ్లిద్దరినీ కలిపే బాధ్యత సత్తారు తాను తీసుకుంటాడు. తాను దాచుకున్న డబ్బుల్ని శరవణ చేతిలో పెట్టి, తన చెల్లాయితో సహా ఊరు దాటిస్తాడు. ఓ సంవత్సరం తరవాత.. శరవణ, తన భార్యతో సహా.. సొంత ఊరికి వస్తాడు. కానీ తాను వచ్చేటప్పటికి సత్తారు ఉండడు. తాను ఏమయ్యాడు? ఆ ఊరి వాళ్లంతా సత్తారుని ఏం చేశారు? అనేది కథ.
ఓ గే.. మనసు, తన మంచితనం, తాను చేసిన త్యాగం.. ఈ కథలో కనిపిస్తాయి. సత్తారు ప్రవర్తన, తన వాలకం చూస్తుంటే.. ప్రేక్షకులకూ కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది.కానీ.. పతాక సన్నివేశాలు చూస్తే ఆ పాత్రపై జాలి, ప్రేమ కలుగుతాయి. ఆ కథకు హీరో తనే అనిపిస్తుంది. సమాజం ఈ తరహా మనుషుల్ని అంటరానివాళ్లుగా ఎందుకు చూస్తుంది? అనే ప్రశ్న ఉదయిస్తుంది. చాలా సున్నితమైన, భావోద్వేగ భరితమైన కథ ఇది. సుధా కొంగర దాన్ని డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. తక్కువ పాత్రల మధ్య సాగే కథే అయినా.. ఎక్కువ మార్కులు జయరాంకి పడతాయి. రెట్రో స్టైల్ లో తీసిన సినిమా ఇది. ఆ కాలాన్ని తెరపై ఆవిష్కరించగలిగారు. పతాక సన్నివేశం ఈ కథకు ప్రాణం.
* లవ్ పన్న ఉత్తనుమ్ (వాళ్లని ప్రేమించుకోనీ..)
విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన కథ ఇది. పరువు హత్య నేపథ్యంలో సాగుతుంది. ఆది లక్ష్మి, జ్యోతిలక్ష్మి ఇద్దరూ కవలలు. ఆది తమ ఇంట్లో పనిచేసే డ్రైవరుని ప్రేమిస్తుంది. ఇదే విషయం తండ్రికి చెబుతుంది. తండ్రి వాళ్ల ప్రేమని అంగీకరించినట్టే అంగీకరించి.. ఆదిలక్ష్మిని, తాను ప్రేమించిన అబ్బాయినీ దారుణంగా చంపేస్తాడు. అదే రోజున విదేశాల నుంచి జ్యోతి లక్ష్మి ఇంటికి వస్తుంది. జ్యోతిలక్ష్మికీ ఓ లవ్ స్టోరీ ఉంది. ఆ కథ తెలిసిన… తండ్రి జ్యోతిలక్ష్మినీ చంపేశాడా? లేదంటే.. వాళ్ల ప్రేమని అర్థం చేసుకున్నాడా? అనేది మిగిలిన కథ.
పరువు హత్యలు ఎలా జరుగుతాయి? వాటికి ఎలాంటి ముసుగు వేస్తారు? అసలు పరువు హత్యలకు ప్రేరేపించే పరిస్థితులేంటి? అనేది ఈ కథలో చూడొచ్చు. ప్రేమకు జాతి, మతం, కులం అనే బేధం ఎందుకు? అవి చూసి ప్రేమ పుట్టదు.. ప్రేమ పుడితే, వాళ్లని ప్రేమించుకోనివ్వాలి… అనే విషయాన్ని చెప్పే కథ ఇది. కన్న కూతుర్ని సైతం పరువు కోసం చంపుకునే కసాయి తండ్రులు ఉన్నారన్న నిజాన్ని.. తెరపై చూపించే ప్రయత్నం చేశారు. ఆది లక్ష్మి విషయంలో తప్పు చేసిన తండ్రి… జ్యోతి లక్ష్మి ప్రేమ విషయంలో ఎలా రియలైజ్ అయ్యాడో.. అంత కసాయి తండ్రిని రెండు మూడు డైలాగులు ఎలా మార్చాయో దర్శకుడు సరిగా చెప్పలేకపోయాడు. కాకపోతే.. చివర్లో ట్విస్టు మాత్రం ఆకట్టుకుంటుంది. లెస్బియెన్స్ అనే పాయింట్ ని డీల్ చేసిన దర్శకుడు.. దాన్ని కామెడీ యాంగిల్ లో వాడుకోవడం నచ్చలేదు. కాకపోతే.. సన్నివేశాల్ని సహజంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూపించగలిగాడు.
కవల సోదరీమణులుగా రెండు పాత్రల్లోనూ అంజలినే కనిపించింది. తన నటన సహజంగా ఉంది. పొట్టి పాత్రలో కనిపించిన నటుడి అవతారం, హావ భావాలూ స్పెషల్ గా అనిపించాయి. మిగిలిన భాషల ప్రేక్షకులకు తమిళ నేటివిటీ కాస్త ఇబ్బంది పెడుతుంది.
* వాన్మగల్ (దివి కుమార్తె)
గౌతమ్ వాసుదేవ మీనన్ చెప్పిన కథ ఇది. మనం తరచూ వార్తల్లో చదివే, చూసే దుస్సంఘటనే. అభం శుభం తెలియని పన్నెండేళ్ల అమ్మాయిని కొంతమంది అత్యాచారం చేస్తారు. అలాంటి దుర్మార్గాన్ని తల్లిదండ్రులు ఎలా డీల్ చేశారన్నదే కథ. పన్నెండేళ్ల పసి పాపని చెరిపితే.. తప్పు, పాపం అంతా ఆ అమ్మాయిదే అన్నట్టు చూస్తుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలి? తమ పాపని ఎలా పెంచాలి? ఆమెకు ఏం చెప్పాలి? అనే విషయాన్ని చర్చించిన కథ ఇది. అత్యంత సున్నితమైన విషయాన్ని వాసుదేవ్ మీనన్ డీల్ చేసిన విధానం చాలా బాగుంది. సిమ్రన్ లాంటి సీనియర్ నటి.. అమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఓ సగటు తండ్రిగా గౌతమ్ మీనన్ కనిపిస్తారు. పన్నెండేళ్ల పసి కందు కొంతమంది దుర్మార్గాన్నికి బలైన వైనం, ఆ తరవాత ఇంటి పరిస్థితులు, తల్లి సాకిన పద్ధతి… కంట తడిపెట్టిస్తాయి. పతాక సన్నివేశాల్లో అమ్మ పాత్రలో సిమ్రన్ చెప్పిన మాటలు.. ఈ సమాజానికి చెంప పెట్టు. ప్రతి అమ్మా ఇలానే ఆలోచిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది.
* వూర్ ఇరవు (ఆ రాత్రి)
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన కథ ఇది. ఇది కథ కాదు. నిజంగా జరిగిన ఘటన. తమిళనాడులో జరిగిన పరువు హత్య నేపథ్యంలో సాగే కథ. ప్రేమించి పెళ్లి చేసుకుని, ఊరు వదిలి వెళ్లిపోయిన ఓ కూతుర్ని (సాయి పల్లవి)ని వెదుక్కుంటూ ఓ తండ్రి (ప్రకాష్ రాజ్) వెళ్తాడు. అప్పటికి కుమార్తె నిండు గర్భిణి. శీమంతం మా ఇంట్లోనే జరగాలి.. అని పట్టుబట్టి ఇంటికి తీసుకొస్తాడు. నాన్న మారిపోయాడు… అని సంతోషంతో పుట్టింటికి వస్తుందా అమ్మాయి. ఓ వైపు సీమంతానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. మరోవైపు తండ్రిలోని కసాయి కోణం బయటపడుతుంది. అదేమిటన్నదే కథ.
పరువు ముసుగులో.. కనీ పెంచిన ప్రేమ, తండ్రి అనే మమకారం కనుమరుగైపోయి, పశువులా ప్రవర్తించిన ఓ తండ్రి కథ ఇది. ఇప్పటికీ ఈ కేసు కోర్టులోనే వుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో తెలీదు గానీ, సభ్య సమాజం తల వంచుకోవాల్సిన దారుణమైన ఘటన ఇది. ప్రకాష్‌రాజ్, సాయి పల్లవిలాంటి నటీనటులు ఉన్నారు కాబట్టి… అత్యంత సహజంగా… తెరపై ఆవిష్కరించే వీలు దక్కింది. సమాజంలో మన మధ్య ఇలాంటి మూర్ఖులు కూడా ఉంటారు.. అని తెలియజెప్పే ప్రయత్నం ఇదనుకోవొచ్చు.
ఈ నాలుగు కథలూ దాదాపుగా ‘పరువు’ అనే పాయింట్ పై సాగేవే. వాటిని చెప్పడానికి ఒక్కో దర్శకుడు ఒక్కో నేపథ్యాన్ని ఎంచుకున్నారు. నాలుగు కథల్లోనూ విషాదం ఉంది. గుండెని మెలిపెట్టే విషయాలు ఉన్నాయి. ఒక్కో కథనీ ఒక్కో సినిమాగానూ తీయొచ్చు. కానీ… ఇవన్నీ చిన్న చిన్న కథలు. కాకపోతే.. పెద్ద పెద్ద విషయాల్ని చెప్పే ప్రయత్నం చేశాయి. మంచి కథలు దొరికినప్పుడు, వాటిని తప్పకుండా చెప్పాలన్న ఆలోచన వచ్చినప్పుడు.. ఈ తరహా ప్రయత్నాలు చేయొచ్చన్న భరోసా కల్పించిన ప్రయాణం ఇది.