జీవితం కూడా జూదమే. ఎప్పుడు ఎక్కడ ఎవరి `పాచికలు` పండుతాయో చెప్పలేం. మనిషి డబ్బు చుట్టూ తిరుగుతూ, డబ్బే జీవితంగా మార్చుకున్నాడు. ఆ డబ్బు సంపాదన కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుంటాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడి – తనతో పాటు, తనకు సంబంధం లేని చాలా జీవితాలను పణంగా పెడుతున్నాడు. ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూనే ఉన్నాడు. అలా ఈజీ మనీ కి అలవాటు పడి, రాత్రికి రాత్రే కోట్లు సంపాదించేయాలనుకున్న ఒకడి కథ… పచ్చీస్. అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన ఈ సినిమాలో దాదాపుగా అంతా కొత్తవాళ్లే. మరి వాళ్ల ప్రతిభ ఏమేరకు ఆకట్టుకుంది. పచ్చీస్ లో చెప్పిన కొత్త పాయింట్ ఏమిటి?
అభిరామ్ (రామ్) జూదరి. క్లబుల్లో పేకాట ఆడి… లక్షలు పోగొట్టుకుంటాడు. క్లబ్ యజమాని ఆర్కే (రవివర్మ)కు రూ.17 లక్షలు బాకీ పడిపోతాడు. ఓ విషయంలో ఆర్కేని మోసం చేస్తాడు కూడా. దాంతో.. ఆర్కే తట్టుకోలేడు. అభిరామ్ ని నీడలా వెంటాడుతుంటాడు. తన అప్పుల్ని తీర్చుకోవడానికి కోటి రూపాయలు కావాలి. అందుకోసం తనకు సంబంధం లేని వ్యవహారంలో తలదూరుస్తాడు. పెద్ద రిస్క్ చేస్తాడు. ఆ రిస్కేంటి? అక్కడి నుంచి అభిరామ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథ.
మరోవైపు…గంగాధర్, బసవరాజు అనే రెండు గ్యాంగులు ఉంటాయి. గంగాధర్ గ్యాంగ్‌లో ఉంటూనే ఓ వ్యక్తి అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటాడు. అతనెవరో తెలుసుకోవడానికి గంగాధర్ గ్యాంగ్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఆ అండర్ కవర్ ఆఫీసర్ ఎవరు అనేది మరో కథ. ఈ అండర్ కవర్ ఆఫీసర్ కథకీ, అభిరామ్ కీ లింకేంటి? అనేది తెరపై చూడాలి.
ఎలాంటి కథ చెబుతున్నాం? ఏ కథ చెబుతున్నాం? అనేది ఎంత ప్రధానమో, ఎంచుకున్న కథని ఎంత సిన్సియర్ గా చెబుతున్నాం? అనేదీ అంతే ప్రధానం. ఈ విషయంలో చిత్రబృందానికి ఎక్కువ మార్కులే పడతాయి. ఎందుకంటే.. కథ నుంచి ఎక్కడా యూ టర్న్‌లు తీసుకోలేదు. తొలి సన్నివేశం నుంచే.. కథ చెప్పడం ప్రారంభించాడు. సైడ్ ట్రాకుల్లేవు. రొమాంటిక్ సీన్లు లేవు. పాటల్లేవు. కేవలం కథ మాత్రమే తెరపై నడుస్తుంది. కాకపోతే… గంగాధర్, బసవరాజు గొడవేంటి? అసలు ఎవరు, ఎవరి కోసం వెదుకుతున్నారు? అనే విషయాలు ప్రేక్షకులకు అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది. అది తెలిశాక.. త్వరగానే కథకు కనెక్ట్ అవ్వొచ్చు. దర్శకుడు రియలిస్టిక్ పంథాని ఎంచుకున్నాడు. సన్నివేశాల తీతలో, రాతలో అది కనిపించింది. మెలో డ్రామా అనే పదం అస్సలు కనిపించదు.
హీరో క్యారెక్టరైజేషన్ పూర్తిగా ఓకే గ్రాఫ్ లో సాగుతుంది. తనకు ఎమోషన్స్ లేనట్టు చూపించారు. ఆఖరికి తన స్నేహితుడు, తన కోసం వచ్చిన స్నేహితుడు.. కళ్లెదురుగా ప్రాణాలు కోల్పోయినా – హీరో పట్టించుకోడు. ఎప్పుడూ తన స్వార్థం తాను చూసుకునే పాత్ర లా ఆ క్యారెక్టర్ ని మలిచారు. నిజానికి… వేరే సినిమాల్లో అయితే, తన స్నేహితుడు చనిపోయిన వెంటనే, హీరో పాత్ర స్వభావం మారిపోతుంది. కానీ.. ఇక్కడ అలా జరగదు. తన స్నేహితుడు చనిపోయినా… ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చడు. ఆ పాత్రని అంత జాగ్రత్తగా డీల్ చేశాడు దర్శకుడు. ద్వితీయార్థం అంతా అండర్ కవర్ ఆఫీసర్ పేరు చెబుతానంటూ… ఆర్కే, అభిరామ్ ల మధ్య సాగే బ్లాక్ మెయిలింగ్ డ్రామా, పోలీసు ఇన్వెస్టిగేషన్.. వీటితోనే సాగుతుంది. క్లైమాక్స్‌లో ఓ ట్విస్టు ఉంటుందని ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. అండర్ కవర్ ఆఫీసర్ ఎవరన్నదే ఆ మలుపు. ఆ ట్విస్ట్ మాత్రం ఊహించడం కష్టమే. ఇంతా చేసి, గంగాధర్ అక్రమాలు బయటపెడితే, రాజకీయ సమీకరణాల వల్ల – ఆ కష్టమంతా బూడిదలో పోసిన సన్నీరవుతుంది. ఎవరెంత కష్టపడినా రాజకీయ చదరంగంలో అంతా పావులుగానే మిగిలిపోతారన్న సంకేతాన్ని… ఇవ్వగలిగాడు దర్శకుడు.
రామ్ కి ఇదే తొలి సినిమా. ఎక్కడా తడబడలేదు. జూదరిగా తన పాత్రలో ఇమిడిపోయాడు. డబ్బు తప్ప.. ఏ ఎమోషన్లూ తనకు అక్కర్లేదనుకునే పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. రవివర్మని ఇది వరకు చాలా సినిమాల్లో చూశాం. కానీ.. ఈసినిమాలో రవివర్మ వేరుగా కనిపించాడు. ఆర్కేగా.. తన నటన అత్యంత సహజంగా అనిపించింది. తన అన్నయ్య ఆచూకీ కోసం.. గాలించే యువతి పాత్రలో శ్వేత వర్మ కనిపించింది. ఈ సినిమాలో ఉన్న ఆడ పాత్ర తనొక్కర్తే. దర్శకుడు ఏ పాత్రకు ఎవరిని తీసుకున్నా.. అంతా వారి వారి పాత్రల్లో అచ్చుగుద్దినట్టు దిగిపోయారు. ఆ క్రెడిట్ దర్శకుడికీ దక్కుతుంది.
ఈ సినిమాలో ఒక్క పాట లేదు. చిన్న బిట్ సాంగ్ తప్ప. పాటలకు స్కోప్ లేనప్పుడు వాటి జోలికి వెళ్లకపోవడమే బెటర్ కాబట్టి.. అదో ప్లస్ పాయింట్ అయ్యింది. ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా చక్కగా పనిచేశాయి. సంభాషణలు సహసత్వానికి దగ్గరగా ఉన్నాయి. `పూర్తి చేయలేని పనిని ఎప్పుడూ మొదలెట్టకు` అనే డైలాగ్ బాగుంది. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవొచ్చు. కాకపోతే..ఆ కథని చెప్పాలనుకునే ప్రయత్నం నిజాయితీగా జరిగింది. ఈమధ్య ఓటీటీలలో చాలా చిన్న సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే.. `పచ్చీస్` కాస్త డిఫరెంట్ ప్రయత్నమే. థియేటర్లో విడుదలైతే.. పరిస్థితి ఏమో గానీ, ఓటీటీలో, థ్రిల్లింగ్ సినిమాలు చూడాలనుకున్నవాళ్లకు `పచ్చీస్` బెటర్ ఆప్షనే.