తెలంగాణలో ఇక పాదయాత్రల సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు.. తాజాగా పీసీసీ కిరీటం దక్కించుకున్న రేవంత్ రెడ్డి ఆలోచనలు కూడా పాదయాత్ర వైపుగానే ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే పాదయాత్ర చేయాలనుకున్నారు. కానీ ఆయనను కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు నియంత్రించాయి. ఎక్కువగా సైలెంట్గాఉండాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీకి చీఫ్ అయ్యారు. సహజంగానే రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువ. ఆయన మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తెస్తారన్న నమ్మకంతోనే హైకమాండ్ పార్టీని అప్పగించింది.
ఆయన చేయాలనుకున్నది చేసే చాన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్.. పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు. కొద్ది రోజుల కిందట.. మినీ పాదయాత్ర కూడా చేశారు. అప్పుడు ఆయనపై హైకామండ్‌కు ఫిర్యాదులు వెళ్లినా .. ఢిల్లీలోస్పందన లేదు. ఇది ఓ రకంగా ఆయనకు గ్రీన్ సిగ్నల్ అనుకోవాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర ఆలోచన చేస్తున్నారు. ఆయన ముహుర్తం కూడా ఖరారు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
జూలై చివరి వారంలో ప్రారంభించాలని.. బీజేపీ ముఖ్యనేతలతో సమాలోచనలు చేస్తున్నారు. అధికార పార్టీలో ఉండేవాళ్లు పాదయాత్ర చేయడం సాధ్యం కాదు కాబట్టి.. ప్రతిపక్ష నేతలే పాదయాత్ర చేస్తారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా.. మరింత హైలెట్ అవడం ఖాయం. తెలంగాణలో 2023 సెప్టెంబర్‌లోనే ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. అంటే.. ఇక అటూ ఇటూగా రెండేళ్లు మాత్రమే. అందుకే నేతలెవరూ వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు.