అన్నపూర్ణ స్టూడియోస్ బుల్లి తెర లో ‘యువ’ అనే టీవీ సీరీస్ స్టార్ట్ చేసి సీరియల్స్ నిర్మాణ రంగం లోకి ప్రవేశించింది. జీ తెలుగులో ప్రసారమైన ఈ టీవీ సీరీస్ చేసి మంచి పేరు తెచ్చుకుంది డైరెక్టర్ చునియా. ఆ పరిచయం తో కింగ్ అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో, చునియా చేసిన మొదటి ఫీచర్ ఫిల్మ్ ‘పడేసావే’. ‘టిప్పు’ సినిమాతో హీరోగా పరిచయం అయిన కార్తీక్ రాజ్ హీరోగా నిత్య శెట్టి, జహీద శ్యామ్ హీరోయిన్స్ గా చేసిన ఈ ట్రై యాంగిల్ లవ్ స్టొరీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బుల్లితెర డైరెక్టర్ చునియా వెండితెరపై కూడా ప్రేక్షకులు మెచ్చుకునే సినిమా చేసిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
కార్తీక్(కార్తీక్) విశ్వ(విశ్వ) ఇద్దరు మంచి ఫ్రెండ్స్.. కార్తీక్ సరిగ్గా చదవక స్టడీస్ లో ఫెయిల్ అవుతూ ఇంట్లో తిట్లు తింటూ లైఫ్ ని గడుపుతుంటాడు. కార్తీక్ పక్క ఇంట్లో ఉండే అమ్మాయే నిహారిక(నిత్యా శెట్టి). కార్తీక్ నిహారిక బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, విషయం ఏమిటంటే, నిహారిక కార్తీక్ ని ప్రేమిస్తుంటుంది. కానీ కార్తీక్ ప్రేమించడు. కట్ చేస్తే అదే టైంలో నిహారిక ఫ్రెండ్ స్వాతి(జహీద శ్యాం)కథలోకి ఎంటర్ అవుతుంది. స్వాతిని చూడగానే కార్తీక్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని విచిత్ర పరిస్థితుల వల్ల కార్తీక్ తనని ప్రేమిస్తున్నాడని ఫిక్స్ అయిపోతుంది నిహారిక. కానీ కార్తీక్ మాత్రం స్వాతిని ప్రేమిస్తుంటాడు. కట్ చేస్తే… నిహారిక కార్తీక్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పించి పెళ్ళికి సిద్దమవుతుంది. కానీ ఆ టైంకే కార్తీక్ తన ప్రేమని స్వాతికి చెప్తాడు. స్వాతి మాత్రం తన ఫ్రెండ్ నిహారిక కోసం కార్తీక్ ప్రేమని రిజెక్ట్ చేస్తుంది. ఇక ఇక్కడి నుంచి కథ ఏం జరిగింది.? ఫైనల్ గా ఎవరు ఎవరి ప్రేమని అంగీకరించారు? ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఎవరు తమ ప్రేమని త్యాగం చేయాల్సి వచ్చింది అనే విషయం మిగతా కథ లో చూడాల్సిందే.
నటి నటుల పెర్ఫార్మన్స్ :
కార్తీక్ ఉన్నంతలో డీసెంట్ గా నటించాడు. కాని కొన్ని సీన్స్ లో హావభావాల పరంగా నటన లో ఇంకా డెవలప్ అవ్వాలి . హీరోకి ఫ్రెండ్ గా చేసిన విశ్వ రాజ్ సినిమాలో అతను కనిపించినప్పుడల్లా కాసేపు నవ్వించడానికి ట్రై చేసారు. సినిమాలో బెస్ట్ రిలాక్సింగ్ సీన్స్ విశ్వ చేసినవే.. ఇక హీరోయిన్స్ లో నిత్యా శెట్టి లో ఎనర్జీ లెవల్స్ బాగున్నాయి. తనకి ఇచ్చిన పాత్రకి న్యాయం చేసింది. కానీ ఇందులో ఆమెకు ట్రై చేసిన లుక్ మాత్రం సెట్ కాలేదు. ఇక జహీద శ్యాం చూడటానికి బాగుంది, అలాగే ఎమోషనల్ సీన్స్ బాగానే చేసింది. అలనాటి హీరోయిన్ రాశి రెండు మూడు సీన్స్ లో అందరినీ ఆకట్టుకుంది. సీనియర్ నరేష్ అనిత చౌదరిలు అక్కడక్కడా కాసేపు నవ్విస్తారు.
సాంకేతిక విభాగం :
ఇక కథ , స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన చునియా విషయానికి వస్తే..తన మొదటి సినిమాకి చాలా పాత కథని, ఇప్పటికే చాలా సార్లు చూసేసిన కథని ఎంచుకుంది. కథ పాతది అయినా కథనం కొత్తగా ఉండేలా ట్రై చేయాల్సింది. కానీ కథనం కూడా కథలానే చాలా పాతగా వుంది. దర్శకత్వ బాధ్యతలను మాత్రం కొంతవరకూ బాగానే డీల్ చేసింది కాని, కథ లో పట్టు లేకపోవడంతో తన దర్శకత్వ ప్రతిభతో ఆడియన్స్ ని థియేటర్స్ లో కూర్చో బెట్టలేకపోయింది. ఇక కిరణ్ రాసిన డైలాగ్స్ కూడా పరవ లేదు అనేలా ఉన్నాయి. ఇక కన్న సినిమాటోగ్రఫీ అదుర్స్. ప్రతి ఫ్రేం, ప్రతి కలర్ ఎఫెక్ట్స్ సినిమా చూసే వారికి రిలీఫ్ ని కలిగిస్తుంది. సినిమాకి ప్రాణం పోసింది అనూప్ రూబెన్స్. తన పాటలు బాగున్నాయి. కానీ సినిమాలో ఎక్కువైపోవడం వలన అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి. ఇకపోతే నేపధ్య సంగీతం మాత్రం సీన్స్ లో మిస్ అయిన కంటెంట్ ని కూడా భర్తీ చేసేలా ఉంది. ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల వర్క్ బాలేదు. పురుషోత్తం ఆర్ట్ వర్క్ బాగుంది.
విశ్లేషణ :
ఎప్పుడైనా ఓ సినిమాకి కథే హీరో.. మిగతా ఎన్ని ఉన్నా కథలేకపోతే సినిమా చూడటం కష్టమే . పైన చెప్పినట్టు ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్. కానీ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కావాల్సిన సరైన కథ లేకపోవడమే బిగ్గెస్ట్ మైనస్. మెయిన్ గా ఈ సినిమాలో చూపిన ట్రై యాంగిల్ లొఎ స్టొరీని ఇప్పటికి మనం చాలా సార్లు చూసాం.. ఎంతలా అంటే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లతో సహా యాజిటీజ్ గా ఉండే సినిమాలు మన తెలుగులోనే వచ్చాయి. కాబట్టి కథ అనేది ఎక్కడా ఆడియన్స్ ని హుక్ చెయ్యదు. ఆ తర్వాత పాత్రలను రాసుకున్న తీరు కూడా బాలేదు. పాత్రలు అన్నీ పైపైనే ఉన్నట్టు అనిపిస్తాయి. ఏ పాత్ర చూసే ఆడియన్ కి పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవ్వదు. ఇలా ఏ పాత్ర కనెక్ట్ కాకపోతే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్వ్ అవ్వరు.దీనికి తోడు సినిమా మొదటి నుంచీ చివరి దాకా చాలా స్లోగా సాగుతుంది. నేరేషన్ ని ఎక్కడా స్పీడప్ చేసే పని చేయలేదు. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టినప్పటికీ అలా అలా సాగిపోయినట్టు ఉంటుంది. కానీ సెకండాఫ్ కి వచ్చే సరికి అస్సలు ముందుకు కదలలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో కమర్షియాలిటీ అనేదాని కోసం అలీ, కృష్ణుడు బాచ్ తో ఓ కామెడీ ఎపిసోడ్ ని పెట్టారు. గే కామెడీ ఫ్లేవర్ వలన ఈ ఎపిసోడ్ నవ్వించకపోగా, ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తుంది. మొదటి నుంచి ఎమోషనల్ బాండింగ్ అనేది సరిగా చూపించకుండా ఒక్కసారిగా సెకండాఫ్ లో ఎమోషనల్ వైపు డ్రైవ్ చేసారు. మొదటి నుంచి ఆ ఫ్లేవర్ లేకపోవడం వలన అవి అంతగా కనెక్ట్ కాలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో పాటలు వరుసబెట్టి వచ్చి సినిమా ఫ్లోని, సినిమా రన్ టైంని బాగా పెంచేసినట్టు అనిపిస్తుంది. పడేసావే సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చెప్పుకోవడానికి యూత్ ఫుల్ లవ్ స్టొరీ అని ప్రమోట్ చేసుకున్నా యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు కూడా చాలా తక్కువగా వున్నాయి. చునియా బుల్లితెర ఫ్లేవర్ నే వెండితెర పైనా ప్రయోగించింది. అందుకే పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కొన్ని కొన్ని సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ ప్లస్ అయితే పాత కథ, రొటీన్ కథనం, లెస్ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోదగిన లోటు . ఓవరాల్ గా ‘పడేసావే’ యూత్ ని మాత్రమే ఆకర్షించే సినిమా కానీ వారిని కూడా పూర్తి స్థాయిలో మెప్పించలేని సినిమా.కింగ్ నాగార్జున ప్రమోషన్స్ విషయంలో ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం, మంచి ఓపెనింగ్స్ కి దోహద పడ్డాయి. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాలో ఓవరాల్ గా కొన్ని కొన్ని మోమెంట్స్ మాత్రం బాగున్నాయి. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.ఇకపోతే ఈ సినిమాని చాలా లో బడ్జెట్ లో తీసారు కానీ ఆన్ స్క్రీన్ విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. అలాగే నిర్మాణ విలువలు బిగ్ బడ్జెట్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది.చివరాఖరుకి చెప్పేదేంటంటే .. ఇది ఓ మామోలు సదా సీదా చిత్రం డిఫరెంట్ మూవీస్ వస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా ఆడటం కష్టమే…
తెలుగు360.కామ్ రేటింగ్: 2/5
అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో….
బ్యానర్ : ఆయాన్ క్రియేషన్స్
నటి నటులు : కార్తీక్ రాజ్, విశ్వ, నిత్యా శెట్టి, జహీద శ్యామ్, రాశి, నరేష్, అనిత చౌదరి…
సినిమాటోగ్రఫీ : కన్నా కూనప రెడ్డి,
ఎడిటింగ్ : ధర్మేంద్ర.కె,
ఆర్ట్ : పురుషోత్తం,
ఫైట్స్ : వెంకట్,
పాటలు : అనంత్ శ్రీ రామ్,
మాటలు : కిరణ్,
కథ ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం : చునియా ,
విడుదల తేది : 26.02.2016