హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా అధికారిక సమావేశంలో రెచ్చిపోయారు. సందర్భం లేకపోయినా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఒరేయ్ నీదిఏ పార్టీ రా అంటూ రెచ్చిరోయారు. దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఇతరులు ఆయనను పక్కకు తీసుకుపోయారు. బయటకు పోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సంజయ్ కుమార్ అన్నం తింటున్నాడా.. పెండ తింటున్నాడా అని మండిపడ్డారు.
ఇదంతా ఎందుకు అంటే ఆయన పార్టీ మారినందుకట. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ తరపున గెలిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారడానికి తన కారణాలు తనకు ఉన్నాయని చెప్పారు కానీ బీఆర్ఎస్ పెద్దల్ని ఎప్పుడూ దూషించలేదు. కేటీఆర్, కవిత కూడా ఆయనపై ఎప్పుడూ దురుసుగా ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. కానీ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం పార్టీ మారాడని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని ఘోరంగా ప్రవర్తించారు. వయసులో పాడి కౌశిక్ రెడ్డి కంటే పెద్ద.. సీనియర్ ఎమ్మెల్యే.
రాజకీయాల్లో పార్టీ మారితే.. రాజకీయంగా విమర్శలు చేసుకుంటారు కానీ ఇలా అధికారిక సమావేశంలో దాడి చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ల మెప్పు కోసం ప్రతీ సారి ఓవర్ గా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి .ఈ క్రమంలో తనకు వస్తున్న పబ్లిసిటీ ఆయనకు సంతృప్తినిస్తోందేమో కానీ.. రాజకీయంగా ఆయన ఇమేజ్ ను దిగజార్చుతోంది.
పార్టీ మారాడని చెలరేగిపోయిన పాడి కౌశిక్ రెడ్డి తన రాజకీయ జీవితం ప్రారంభించింది కాంగ్రెస్ లో. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు అయిన ఆయన ఆ బంధుత్వంతో కాంగ్రెస్ లో అవకాశాలు తెచ్చుకుని బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్లో అవసరం లేని అతి విధేయత ప్రదర్శిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.