చేతకాకపోతే చీర, గాజులు కట్టుకోవాలని సవాల్ చేసే రోజులు పోయాయి. తమను ఎవరైనా కించ పరిస్తే మహిళలు అంతా తిరగబడే పరిస్థితి వచ్చింది. లీడర్లు అప్ డేట్ కాకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మహిళలతో పెట్టుకున్నారు. ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విమర్శలు చేసేందుకు మహిళల్ని కించ పరిచారు. చీరలు, గాజుల్ని పార్టీ ఆఫీసుకు తీసుకు వచ్చి..వీటిని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పంపుతున్నానని గొప్పగా ప్రకటన చేశారు.
ఆయన ప్రకటన బీఆర్ఎస్ మహిళా నేతలకు ఎలా ఉందో కానీ కాంగ్రెస్ మహిళా నేతలకు మాత్రం చిత్రెచ్చింది. వారు వెంటనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కౌశిక్ రెడ్డికి పాడె కడతామని హెచ్చరించారు. మహిళలంటే అంత చులకనా అని మండిపడ్డారు. తక్షణం క్షమాపణ చెప్పాలన్నారు. రాజకీయ విమర్శలు చేయడానికి మహిళల్ని కించ పర్చడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. భార్య , కూతుర్ని పక్కన పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఏడ్చి గెలిచావని.. మండిపడ్డారు.
కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ కు మొదటి నుంచి ఇబ్బందిగానే మారింది. ఆయన దూకుడు పార్టీకి ఏ మాత్రం మేలు చేయకపోగా అనేక కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మహిళా నేతలంతా మండిపడేలా ఆయన వ్యాఖ్యలను.. సొంత పార్టీ మహిళా నేతలు కూడా సమర్థించే అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ దీన్ని వదిలే అవకాశం లేదు. మరి కౌశిక్ రెడ్డి ఎలా సమర్థించుకుంటారో.. ఆయనకు మాత్రం మహిళల సెగ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.