రాజకీయాల్లో దూకుడుగా ఉండవచ్చు కానీ రోజూ దూకుడమే అయితే ఎక్కడో చోట పడి మొదటికే మోసం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఆ పరిస్థితి ఎదురవుతోంది. ఆయన రోజూ ఏదో అలజడి సృష్టించడానికే ప్రయత్నిస్తున్నారు. తన ఎదురుగా ఉన్నది రాజకీయ నేతలా.. అధికారులా అన్నది పట్టించుకోవడం లేదు.. దూసుకెళ్లిపోతున్నారు. ఫలితంగా కేసుల పాలవుతున్నారు.
డీఈవో ఏదో చేశాడని ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని జడ్పీ సమావేశంలో రచ్చ చేశారు. లోపల ఎంత చేసినా ..బయట మాత్రం పద్దతిగా ఉండాలి. కానీ సమావేశం బయటకు వచ్చి బైఠాయించారు. కలెక్టర్ వెళ్తూంటే వెళ్లకుండా అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దాంతో న్యాయ సంహిత కిందట కేసు పెట్టించుకున్న మొదటి ప్రజాప్రతినిధిగా మారారు. ఇక రాజకీయంగా ఆయన చేస్తున్న రచ్చ హుజూరాబాద్ ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. ఆయన అక్కడ జరుగుతున్న పనుల్లో వాటాల కోసం డిమాండ్ చేస్తున్నట్లుగా .. బెదిరిస్తున్నట్లుగా రాజకీయం చేస్తున్నారు.
ఓ సారి మైనింగ్ అంటారు..మరోసారి ఫ్లైయాష్ అక్రమరవాణా అంటారు.. పొన్నం వందల కోట్లు సంపాదిస్తున్నారని అంటారు. కానీ దేనికీ ఆధారాలు ఉండవు. పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు ఇస్తే ప్రమాణాలు చేద్దామని సవాల్ చేసి అదే పెద్ద రాజకీయం అనుకున్నారు. కౌశిక్ రెడ్డి దూకుడును కంట్రోల్ చేయకపోతే ఆయన వెళ్లి పెద్ద గంతలో పడిపోతారని.. మళ్లీ లేపడం కూడా కష్టమనని బీఆర్ఎస్ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు.