పోలీసులతో వ్యక్తిగతంగా లడాయి పెట్టుకున్న పాడి కౌశిక్ రెడ్డికి సినిమా చూపించేందుకు డిపార్టుమెంట్ రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది కానీ పూర్తిగా ఇరుక్కుపోయారు. ఆయన కారుతో పాటు ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఆయన చేసిన హంగామా వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఫోన్ ను విశ్లేషించి అందులో కుట్రదారుల్ని కనిపెట్టాలని అనుకుంటున్నారు.
పోలీసులు ఫోన్ ను సీజ్ చేస్తారని కౌశిక్ రెడ్డి అనుకోలేదు. దీంతో ఇప్పుడు తన ఫోన్ ఓపెన్ చేయకుండా ఉండేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయాలని అనుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలు తెలుసుకుని ఇబ్బంది పెడుతారని కౌశిక్ రెడ్డి ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం కౌశిక్ రెడ్డిని తమ టార్గెట్ లిస్టులో పెట్టుకుని ఉంటే మాత్రం ఈ పాటికి ఫోన్ లో ఉన్న రహస్యాలన్నీ సేకరించేసి ఉంటారన్న గుసగుసలు ఉన్నాయి.
బీఆర్ఎస్ లో చాలా మంది రాజకీయం చేస్తున్నారు కానీ.. ఆ రాజకీయానికి అతి అతికించేసింది మాత్రం పాడి కౌశిక్ రెడ్డి. సోషల్ మీడియా టీంను వెంటబెట్టుకుని ఆయన చేసే రచ్చ చూస్తే.. ఇంత డ్రామానా అని అందరూ ఆశ్చర్యపోతారు. అయితే అదే రాజకీయ అనుకుంటున్నారు కౌశిక్ రెడ్డి. ఇప్పుడు పోలీసులతో పెట్టుకున్నారు. వారు తమ గేమ్ ఆడితే.. కౌశిక్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక అయ్యే అవకాశం ఉంది.