పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ నటనలో ఆరితేరిపోతున్నారు. సోషల్ మీడియా కాలంలో అలాంటివి కామెడీ అవుతాయని ఎవరూ చెప్పలేదో.. లేకపోతే రాజకీయాల్లో అవి మాత్రమే వర్కవుట్ అవుతాయని అనుకుంటున్నారో కానీ ఆయన మాత్రం రెచ్చిపోతున్నారు. కేసీఆర్ హయాంలో పెండింగ్ లో పెట్టిన దళిత బంధు నిధుల్ని ఇవ్వాలని తాజాగా ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఆయన కోసం వందల మంది రాలేదు. పట్టుమని పది మంది కూడా లేరు. కానీ పోలీసుల సాయంతో..తన సోషల్ మీడియా టీం క్రియేటివిటీతో ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ఔరా అనుకున్నారు.
తాను చెప్పాలనుకున్నది.. చేయాలనుకున్న చాలా పర్ ఫెక్ట్ గా వీడియోల్లోకి వచ్చేలా చేసుకున్నారు. ఆయన పండించిన సన్నివేశాల్లో స్పృహ తప్పడం దగ్గర నుంచి ఆస్పత్రిలో చొక్కా విప్పేసి మీడియాతో మాట్లాడటం.. చివరికి చేతికి కట్టుతో బయటకు రావండి వరకూ చాలా ఉన్నాయి. అన్నా కాస్త ఓవర్ గా ఉందే అని వస్తున్న కామెంట్లను ఆయన అసలు పట్టించుకోవడం లేదు. ఆయన తీరు ఎలా ఉంటుందంటే.. తనకు వాళ్లతో వీళ్లతో పంచాయతీ లేదని.. తనకు నేరుగా రేవంత్ రెడ్డితోనే పంచాయతీ అని చెప్పేసుకుంటున్నారు.
పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల రోజు గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీఫ్ చేశారు. అప్పట్నుంచి ఆయన కామెడీ అవుతూనే ఉన్నారు. ఇటీవల మాట్లాడితే కాంగ్రెస్ నేతల ఇళ్లపైకి వెళ్తానని బయలుదేరుతున్నారు. పీఏసీఎ చైర్మన్ వివాదంలో ఆయన పై దాడి జరిగింది. ఇటీవల ఫామ్ హౌస్ కేసు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి వీడియోలు తన వద్ద ఉన్నాయని.. చెప్పుకొచ్చారు. ఇలాంటి మాటలతో ఆయన రాజకీయం లైట్ తీసుకునేలా మారిపోతోంది. చేతలతోనూ అదే చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిరాజకీయ వారసుడు అయిన కౌశిక్ రెడ్డి ఇంత అతి చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్లలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.