పడి పడి లేచె మనసు ట్రైలర్లు, పాటలు చూస్తుంటే.. ఇదో సంపూర్ణ ప్రేమకథలా అనిపిస్తోంది కదూ. శర్వానంద్, సాయిపల్లవిల కెమిస్ట్రీ అదిరిపోవడం, టైటిల్ యూత్ ఫుల్గా ఉండడంతో… ఇది అచ్చంగా ప్రేమకథే అనుకుంటున్నారంతా. మరో ఖుషీ అవ్వబోతోందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే హను రాఘవపూడి దీనినో ప్రేమకథగా మాత్రమే రూపుదిద్దలేదు. అంతకు మించి ఏదో అందివ్వబోతున్నాడన్నది లేటెస్ట్ టాక్.
అవును.. ఈ సినిమా పతాక సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయట. అప్పటి వరకూ ప్రేమకథలా సాగుతున్న ఈ సినిమాలో ఓ ట్విస్టు ఏకంగా సినిమా స్వరూపాన్నే మార్చబోతోందని టాక్. `అందాల రాక్షసి`ని పూర్తి ప్రేమకథలా తీసిన హను.. ‘లై’లో ట్విస్టులు రంగరించాడు. ఇప్పుడు ఈ రెండింటి మేళవింపుగా ఈ సినిమా ఉండబోతోందన్నమాట. శర్వానంద్ – సాయి పల్లవి మధ్య సాగే లవ్ ట్రాక్ మొత్తం అద్భుతంగా వచ్చిందని. ఆ ట్విస్టు ఎక్కితే గనుక… ఈ సినిమా మరో రేంజులో ఉంటుందని, ప్రేమకథల్లోనే వైవిధ్యమైన చిత్రంగా మిగిలిపోతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ‘పోకిరి’, ‘టెంపర్’ సినిమాల్లో చివర్లో వచ్చిన ట్విస్టులే సినిమాని నిలబెట్టాయి. అయితే అవి పూర్తి యాక్షన్ చిత్రాలు. ఇదేమో ప్రేమకథ. లవ్ స్టోరీల్లో ట్విస్టంటే.. ఎలా ఉంటుందో చూడాలి.