తెలుగు360 రేటింగ్ 2.5/5
అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రాలతో హను రాఘవపూడి ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ అనిపించుకొన్నాడు. ప్రేమకంటే కూడా వాటిలో సెన్సిబిలిటీస్, కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచింది. దాంతో హను ప్రతిభగల దర్శకుల జాబితాలో చేరిపోయారు. మధ్యలో `లై`తో పరాజయం చవిచూసినా ఆ ప్రభావం ఆయనపై పెద్దగా పడలేదనే చెప్పాలి. ఆయన మరోసారి తనకి అచ్చొచ్చిన ప్రేమకథతోనే `పడి పడి లేచే మనసు` తీశారు. ప్రేమకథల్లో చక్కగా ఒదిగిపోగలనని శర్వా కూడా పలు చిత్రాలతో నిరూపించారు. ఆయనకి సాయిపల్లవి కూడా తోడవడంతో ఈ కలయిక అంచనాల్ని పెంచింది. మరి చిత్రం అందుకు తగ్గట్టుగా ఉందా? శర్వానంద్ విజయాల జోరు కొనసాగిందా? హను ఈసారి విజయం దక్కించుకొంటాడా? తదితర విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
కథ
సూర్య (శర్వానంద్) కోల్‌కత్తాలో పుట్టి పెరిగిన తెలుగు కుర్రాడు. ఫుట్‌బాల్ ఆడుతూ స్నేహితులతో సరదాగా తిరుగుతుంటాడు. అనుకోకుండా వైశాలి (సాయిపల్లవి)ని చూసి ప్రేమలో పడతాడు. మెడికో అయిన వైశాలిని ప్రేమలో దించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు సూర్య. అతని మనసుని చూసి ఎట్టకేలకి ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. ప్రేమలో ఉందాం కానీ… పెళ్లి వద్దంటాడు సూర్య. దాంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతుంది. అసలు సూర్య పెళ్లి ఎందుకు వద్దన్నాడు? విడిపోయిన ఆ ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారా లేదా? యేడాది తర్వాత వాళ్లిద్దరూ ఒకరికోసం మరొకరు ఏం చేశారన్నదే మిగతా కథ.
విశ్లేషణ
ప్రేమకల్లో సంఘర్షణ కీలకం. దర్శకుడు కూడా ఆ విషయంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. కానీ అదే ఈ కథకి అతకలేదు. ప్రేమజంటకి సమస్యలు వేరొకవైపు నుంచి వచ్చినప్పుడే సన్నివేశాలు బాగా పండుతాయి. కానీ ఇక్కడ మాత్రం వాళ్లకి ప్రేమకి వాళ్లే శత్రువులుగా మారతారు. వాళ్లకి వాళ్లే చిక్కులు కొని తెచ్చుకుంటారు. అందులోనే తన మార్క్ కవితాత్మకత కనిపిస్తుందనుకున్నాడు దర్శకుడు. కానీ ఆ కాన్‌ఫ్లిక్టే పండకపోయేసరికి సినిమా ఆద్యంతం బోరింగ్‌గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రథమార్థం వరకు సినిమా బాగానే ఉందనిపిస్తుంది. కానీ విరామం సమయానికి వచ్చేసరికి వ్యవహారం మరీ సిల్లీగా మారిపోతుంది. ఓ చిన్న కారణానికే ప్రేమికులు విడిపోతారు. అప్పటిదాకా ప్రేమించిన కుర్రాడు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి నో చెబుతాడు. అందుకు కారణం తనఇంట్లో చూసిన వాతావరణమే. కానీ ఆ మాత్రం దానికే అప్పుడే ప్రేమలో పడిన జంట విడిపోతుందా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో కలుగుతాయి. విరామానికి ముందు సన్నివేశాల్లో భూకంపం కాన్సెప్ట్‌ని బాగా వాడుకొన్నాడు. అది కథకి మంచి మలుపే. కానీ ఆ తర్వాత సన్నివేశాలే గాడితప్పాయి. మెమరీ లాస్ అంటూ ఓ కొత్త డిజార్డర్ నేపథ్యాన్ని తీసుకొన్నాడు దర్శకుడు. దాన్ని కూడా అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. మొదట అబద్ధంతో మొదలైన ప్రేమకథ.. ద్వితీయార్థంలోకి వచ్చేసరికి ఏది అబద్ధమో, ఏది నిజమో… అర్థం కాని పరిస్థితికొస్తుంది. `కృష్ణగాడి వీరప్రేమగాథ`లో బాగా నవ్వించిన హను, ఇందులో కామెడీ పరంగా కూడాతన పనితనం ప్రదర్శించలేకపోయారు. ఎంతో మనసు పెడితే తప్ప హాస్య సన్నివేశాలు కూడా అర్థం కావు. ఆరంభంలో పర్వాలేదనిపించినా… చివరికొచ్చేసరికి గందరగోళంగా ముగుస్తుంది.
నటీనటులు.. సాంకేతికత
శర్వానంద్, సాయిపల్లవిల నటన చిత్రానికి ప్రధానబలం. పరిణతితో కూడిన నటనని ప్రదర్శించారు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. ఈ సినిమాని కాస్తలో కాస్త ఆసక్తికరంగా మార్చడంలో ఈ ఇద్దరే కీలకం. సినిమా ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరగడంతో మిగిలిన పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. కానీ వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సునీల్ పాత్రల పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళీశర్మ, ప్రియారామన్ కథానాయకకి తల్లిగా నటించిన నటి పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపిస్తారు. సాంకేతికంగా సినిమా సౌండ్‌గా ఉంది. జె.కె. కెమెరా పనితనం ఆకట్టుకునేలా ఉంది. విశాల్ చంద్రశేఖర్ మంచి మెలోడీలు అందించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడిగా హను రాఘవపూడి పనితనం మెప్పించలేకపోయింది. ఆయన ఎంచుకొన్న నేపథ్యం బాగున్నప్పటికీ… ద్వితీయార్థం గాడి తప్పింది.
తీర్పు
చిన్న చిన్న లోపాలతో మంచి కథలు కూడా గాడి తప్పుతుంటాయి. అందుకు మరో ఉదాహరణే ఈ చిత్రం. ప్రథమార్థం వరకు బాగానే అనిపించినా… ద్వితీయార్థం రిపీటెడ్‌గా, ఏమాత్రం భావోద్వేగాలు పండించకుండా సాగుతుంది సినిమా. పేరుకు పడి పడి లేచే మనసు కానీ.. సినిమా మాత్రం చాలాసార్లు పడుతుంది కానీ లేవదు.
ఫైనల్ టచ్: పడి… పడి.. లేస్తూ..
తెలుగు360 రేటింగ్ 2.5/5