ప్రేమ కథలు బాక్సాఫీసు దగ్గర గెలవాలంటే ఉండాల్సింది.. కెమిస్ట్రీనే. నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ ఎంత అందంగా కుదిరితే ఆ సినిమా అంత హిట్టు. ఈ విషయాన్ని నవతరం దర్శకులు బాగానే గుర్తు పెట్టుకున్నారు. ఓ అందమైన జంటని వెండి తెరపై చూపించి – వాళ్ల మధ్య స్వీట్ నథింగ్స్ సృష్టించి హిట్లు కొడుతున్నారు. `పడి పడి లేచె మనసు` టీజర్లోనూ ఆ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. శర్వానంద్ – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రమిది. హను రాఘవపూడి దర్శకుడు. డిసెంబరు 21న విడుదల చేస్తున్నారు. ఈరోజు టీజర్ విడుదలైంది. సాయి పల్లవిని ఎక్కడ పడితే అక్కడ ఫాలో అవుతుంటాడు శర్వా. అది గమనించిన సాయి `ఏంటి ఫాలో చేస్తున్నావా` అని నిలదీస్తే… `అరె మీకు తెలిసిపోయిందా? అయినా మీరిలా దగ్గరకొచ్చి మాట్లాడడం ఏమీ బాగాలేదండీ.. నేనేదే అరకిలోమీటరు దూరం నుంచి మిమ్మల్ని చూస్తూ ప్రేమిస్తూ బతికేస్తుంటే..` అని అమాయకంగా అంటాడు. ఈ మొత్తాన్ని 60 సెకన్ల టీజర్ లో బంధించేశాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, చివర్లో బోట్‌పై షాటు, బీజియమ్… ఇవన్నీ ఈ టీజర్‌ని నిలబెట్టేశాయి. చూస్తుంటే… మరో అందమైన ప్రేమకథ త్వరలో రాబోతోందని అనిపిస్తోంది. చూద్దాం.. బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉంటుందో.