మనిషి శాశ్వతం కాదు. కానీ భూమి శాశ్వతం, ప్రకృతి శాశ్వతం. మనం ఎలా వచ్చామో అలాగే పోతాం..ఉన్న సమయంలో భూమిని, ప్రకృతిని నాశనం చేయకూడదు. కానీ ప్రపంచంలో ఇప్పుడు జరగుతోంది ప్రకృతి విధ్వంసం. మనుషుల లగ్జరీ కోసం విధ్వంసం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రకృతిని, చెట్లను కాపాడేందుకు ఒంటరిగా తన జీవితాన్ని త్యాగం చేశారు వనజీవి రామయ్య.
ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య యాభై ఏళ్లుగా తన జీవితాన్ని చెట్లకు అంకితం చేశారు. అలుపెరగకుండా మొక్కలు నాటి, కోటికి పైగా చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణకు ఒంటరిగా ప్రయత్నించారు. చెట్టును నువ్వు కాపాడితే.. చెట్టు నిన్ను కాపాడుతుందనే సూక్తిని ఆయన జీవన సిద్ధాంతంగా మార్చుకున్నారు. ఆయన, రోడ్ల పక్కన, గుట్టలపై, ఖాళీ స్థలాల్లో విత్తనాలు చల్లేవారు. ఆయన విత్తు నాటిన చెట్లు ఇప్పుడు ఎంతో పచ్చదనాన్ని ఇస్తున్నాయి.
రామయ్య 120 రకాల మొక్కల చరిత్రను వివరించగలడు. ఆయన సేవలకు గుర్తింపుగా 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఆయన గురించి ఆరో తరగతి సోషల్ పాఠాల్లో పెట్టింది. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేసింది. ఆయన గురించి తెలియకపోయినా ఆయన నాటి చెట్ల వచ్చే ఆక్సీజన్, చల్లదనాన్ని అందరూ ఆస్వాదిస్తారు. కాలుష్యం తగ్గించడంలో ఆయన కృషి కౌంట్ కాకపోవచ్చు కానీ.. అందులో ఆయన ముద్ర ఉంటుంది.
వనజీవి రామయ్య తుదిశ్వాస విడిచారు. ఆయనకు ప్రధాని మోదీ కూడా నివాళులు అర్పించారు. చంద్రబాబు , కేసీఆర్ సహా అందరూ ఆయనను గుర్తు చేసుకున్నారు. ఓ సామాన్యుడు సమాజానికి ఎంతో ఇచ్చారు. అందుకే అందరూ గుర్తు చేసుకున్నారు. ఆయన లక్ష్యాన్ని , స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకుంటే చాలు..అదే ఆయనకు అసలైన నివాళి.