నటి శోభన పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డుకు శోభన నూటిని నూరుపాళ్లూ అర్హురాలు. ఎందుకంటే నటిగా విభిన్నమైన పాత్రలు చేసిన శోభన… నాట్యకళాకారిణిగానూ విశేష సేవలు అందించారు. తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. రెండుసార్లు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకొన్నారు. తెలుగులో ఆనాటి అగ్ర హీరోలందరితోనూ నటించారు. మంచి జోడీ అనిపించుకొన్నారు. రుద్రవీణ, రౌడీగారి పెళ్లాం, అల్లుడుగారు, నారీ నారీ నడుమ మురారీ, కోకిల, రౌడీ అల్లుడు, అభినందన, ఏప్రిల్ 1 విడుదల తదితర చిత్రాలు శోభనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇది వరకే కేంద్ర ప్రభుత్వం శోభనకు పద్మశ్రీ ఇచ్చింది. ఇప్పుడు మరో కలుకితురాయి చేరింది.
నటన కంటే నాట్యం అంటేనే తనకు ప్రేమ అని శోభన చాలాసార్లు చెప్పారు. వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చారు. అంతే కాదు.. 1994లో కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేశారు. ఈ సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా సంప్రదాయ నృత్యాన్ని కళాభిమానులకు చేరువ చేశారు. శోభన చాలామంది శిష్యుల్ని తయారు చేసుకొన్నారు. దాదాపు వంద మంది నాట్యకారులకు ఆమె వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చారు. వ్యక్తిగతంగానూ శోభన జీవితం ఆదర్శవంతమైనది. ఆమె పెళ్లి చేసుకోలేదు. అయితే ఓ బిడ్డని చేరదీసి, అమ్మగానూ సంతృప్తికరమైన జీవితాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం `లెజెండ్ 2`లో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అడపా దడపా కొన్ని చిత్రాల్లో మెరుస్తున్నారు. అయితే ఎక్కువ సమయం నాట్యానికే కేటాయిస్తున్నారు.