గుజరాత్ ఎన్నికల ఫలితాలు, మరికొన్ని రాజకీయ సంకేతాల తర్వాత దేశంలో వాతావరణం నెమ్మదిగా మార్పులకు లోనవుతున్నట్టు కనిపిస్తుంది. పద్మావతి చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇస్తూ సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన వర్తమానం ఈ తరహాకే చెందుతుంది. చిత్రం పేరును స్పష్టత కోసం పద్మావత్‌గా మార్చాలని కూడా సూచించారట. చిత్రంలో మొత్తం 27 చోట్ల కట్లు పెట్టినట్టు చెబుతున్నారు. అయితే అవి నిజంగా కట్లు కాదనీ, ఎక్కువ భావం పదాల పేర్ల ఉచ్చారణకు సంబంధించినవని సెన్సార్‌బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి స్వయంగా చెప్పారు. చిత్రం గురించిన చర్చ విస్తారంగా జరిగిన దృష్య్యా వివరణ ఇవ్వడం అవసరమని భావించారట. ఆనవాయితీ ప్రకారం వారు సూచించిన మార్పులు చేసిన తర్వాత మరోసారి చూసి తుది అనుమతి ఇస్తారు. వివాదాలు విమర్శల నేపథ్యంలో పద్మావతి చిత్రం పరిశీలనకు ప్రత్యేక నిపుణులను కూడా నియమించారట. అయితే ఇది కొత్త కాదనీ గతంలోనూ జోధా అక్బర్ ఆరక్షణ్ వంటివాటికి నియమించారని అధికారులు సమర్థిస్తున్నారు. అయితే నిజంగా జరిగిందేమిటి, దర్శక నిర్మాతల స్పందన ఏమిటి అన్నది ఇంకా బయిటకురాలేదు. నిజంగా సమస్య పరిష్కారమై చిత్రం విడుదలైతే చాలా మంచిదే. మొత్తానికి గుజరాత్ దెబ్బకు బిజెపి ఆరెస్సెస్‌లు వివాదాలను తగ్గించాలని చూస్తున్నాయనడానికి పద్మావతి మరో ఉదాహరణ అనుకోవాలా? ఇదైనా ఎన్ని నిరనసలు ఆందోళనల ఫలితంగా జరుగుతున్నది!